తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య పోలవరం వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ వేడినిపుట్టిస్తున్నాయి. తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మంత్రుల మధ్య మరోసారి డైలాగ్ వార్ నడిచింది. ఇటీవల ఏపీలో ఉపాధ్యాయుల పరిస్థితి గురించి వ్యాఖ్యలు చేసిన తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు.. తాజాగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కామెంట్స్ చేశారు. 'పోలవరం కాళేశ్వరం కంటే ముందు స్టార్ట్ అయ్యింది. ఇప్పటికీ పూర్తి కాలేదు. ఇంకా ఐదేళ్లు అయినా పూర్తి కాదు. కొంతమంది ఇంజినీర్లను అడిగితే.. ఇంకా ఐదేళ్లు అయినా పూర్తి కాదని చెబుతున్నారు. కానీ.. మనం కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత వేగంగా పూర్తి చేశామో అందరూ చూశారు. ఇప్పుడు దాని ఫలాలు అందరికీ అందుతున్నాయి' అని హరీష్ రావు వ్యాఖ్యానించారు.
హరీష్ రావు చేసిన కామెంట్స్‌పై ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు చాలా సాఫ్ట్‌గా రియాక్ట్ అయ్యారు. తనదైన స్టైల్‌లో హరీష్ రావుకు కౌంటర్ ఇచ్చారు. 'ఆ ప్రభుత్వం గొప్పదనాన్ని చెప్పారో.. వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని కించపర్చడానికి పోల్చారో తెలియదు గానీ.. కాళేశ్వరం ప్రాజెక్టు వేరు. పోలవరం ప్రాజెక్టు వేరు. కాళేశ్వరం కేవలం 2 టీఎంసీల కెపాసిటీ ఉన్నటువంటి బ్యారేజీ. అంత కంప్లీట్ లిఫ్ట్ ఇరిగేషన్. కానీ పోలవరం అలా కాదు. ఇది బహుళార్దకమైన ప్రాజెక్టు. 196 టీఎంసీ స్టోర్ చేసుకొని గ్రావిటీ ద్వారా నీరు తరలిస్తాం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ పోలవరం. కాళేశ్వరం ప్రాజెక్టుకు, పోలవరం ప్రాజెక్టుకు.. నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంది' అని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.
అ తర్వాత పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యానికి కారణాలను కూడా వివరించారు. 'పోలవరం నిర్మాణంలో జాప్యం జరుగుతున్నది నిజమే. దానికి అనేక కారణాలున్నాయి. డయాఫ్రం వాల్ ముందే నిర్మించడం వల్ల ఈ సమస్య వచ్చింది. స్పిల్ వే తర్వాత డయాఫ్రం వాల్ నిర్మించాలి. కానీ.. అలా చేయలేదు. అది పూర్తిగా తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు చేసిన తప్పు. డయాఫ్రం వాల్ వరదల కారణంగా దెబ్బతిన్నది. ఇప్పుడు దానిపై పరిశోధనలు జరుగుతున్నాయి. దానిపై క్లారిటీ వచ్చాక పోవరం నిర్మాణంపై స్పష్టత వస్తుంది' అని అంబటి రాంబాబు వివరించారు.