ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్.. దేశీయ విద్యుత్తు స్కూటర్ల మార్కెట్‌ను ఏడాది క్రితం శాసించింది. అత్యధిక మార్కెట్ వాటాతో ఇతర కంపెనీలకు అందనంత ఎత్తులో నిలిచింది. కానీ ఏడాది వ్యవధిలోనే అంతా తలకిందులైంది.దిగ్గజ కంపెనీలు ఎలక్ట్రిక్ టూ-వీలర్ల విభాగంలోకి ఎంట్రీ ఇవ్వడంతో ఓలాకు డిమాండ్ తగ్గుతూ వచ్చింది.ఇప్పుడు మార్కెట్ వాటా విషయంలో నాలుగైదు కంపెనీల కంటే దిగువకు పడిపోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కంపెనీ ఆదాయం భారీగా తగ్గి నష్టాలు పెరిగాయి. దీంతో దిద్దుబాటు చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా తమ షోరూమ్‌లను భారీగా మూసివేస్తోంది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.
ఈ ఏడాది 2026 మార్చి నెల ముగిసే నాటికి దేశవ్యాప్తంగా తమ ఫిజికల్ స్టోర్ల సంఖ్యను 550కి తగ్గించుకోవాలని ఓలా ఎలక్ట్రిక్ నిర్ణయించింది. తమ టూ-వీలర్లకు డిమాండ్ తగ్గిపోయి మార్కెట్ షేరు పడిపోవడం, నిర్వహణ సవాళ్లు పెరుగుతున్న క్రమంలోనే ఈమేరకు ఫిజికల్ స్టోర్లను మూసివేయాలని నిర్ణయించుకున్నట్లు కంపెనీ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా సంస్థలు వార్తాల కథనాలు ప్రచురించాయి. బెంగళూరు కేంద్రం ఎలక్ట్రిక్ టూవీలర్ల తయారీ చేస్తోన్న ఈ కంపెనీ పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైందని ఈ స్టోర్ల మూసివేత చెబుతోందని పేర్కొన్నాయి. సరిగ్గా ఏడాది క్రితమే దేశవ్యాప్తంగా తమ రిటైల్ నెట్‌వర్క్‌ని 4000 స్టోర్లకు విస్తరిస్తామని ప్రకటించగా ఇప్పుడు ఆ సంఖ్యను 550కి పరిమితం చేయాలని నిర్ణయించడం గమనార్హం.
డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసిక ఫలితాల ప్రకటన సందర్భంగా కీలక విషయాలు వెల్లడించింది. కంపెనీల పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికల్లో భాగంగా ఇప్పటికే తమ ఫిజికల్ స్టోర్ నెట్‌వర్క్ సంఖ్యను 700లకు పరిమితం చేసినట్లు ఓలా ఎలక్ట్రిక్ తెలిపింది. క్యూ3 తర్వాత ఓలా ఎలక్ట్రిక్ వ్యవస్థీకృత మార్పులు చేపట్టినట్లు తెలిపింది. ఈవీల వృద్ధి మందగించడం, తమ సర్వీసులను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నందున స్వల్పకాల పరిష్కారాలు కాకుండా దీర్ఘకాలంలో స్థిరమైన స్థితికి చేరుకునే ప్రయత్నాలు చేపట్టినట్లు కంపెనీ తెలిపింది.
ఓలా ఎలక్ట్రిక్ ఇప్పటికే దేశవ్యాప్తంగా చాలా స్టోర్లను మూసివేసింది. ఆయా ప్రాంతాల్లోని స్టోర్లలో పని చేస్తున్న ఉద్యోగులను కంపెనీ వీడాలని సమాచారం అందించినట్లు తెలుస్తోంది. అయితే, ఓలా ఎలక్ట్రిక్ నుంచి స్టోర్ల మూసివేతపై అధికారికంగా ప్రకటన వెలువడలేదు. 2025, డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికంలో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ నికర నష్టం రూ.487 కోట్లుగా నమోదు చేసింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో రూ.564 కోట్ల లాభం నుంచి భారీగా పడిపోవడం గమనార్హం. అలాగే కంపెనీ ఆపరేషన్స్ రెవెన్యూ 55 శాతం మేర పడిపోయి రూ.470 కోట్లుగా చూపించింది.
డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ 32,680 ఎలక్ట్రిక్ టూ-వీలర్లను డెలివరీ చేసింది. అయితే, గతేడాదితో పోలిస్తే ఇది 61 శాతం తక్కువ. వాహన్ వెబ్‌సైట్లోని వివరాల ప్రకారం ఎలక్ట్రిక్ టూవీలర్ల మార్కెట్లో ఓలా వాటా జనవరి 2026లో 6.3 శాతానికి పడిపోయింది. అంతకు ముందు ఏడాది క్రితం 26 శాతం వాటా కలిగి ఉండేది. ఈ ఫిబ్రవరి నెలలో 18వ తేదీ వరకు 2575 వెహికిల్స్ మాత్రమే విక్రయించగలిగింది. మార్కెట్ వాటా పరంగా చూసుకుంటే టీవీఎస్ మోటార్, బజాజ్ ఆటో, హీరో మోటో కార్ప్, ఏథర్ ఎనర్జీ వంటి కంపెనీల కంటే దిగువకు పడిపోయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa