ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సంజూకి నో ఛాన్స్! తేల్చి చెప్పిన సూర్యకుమార్ యాదవ్

sports |  Suryaa Desk  | Published : Sat, Feb 21, 2026, 10:40 PM

ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో వరుసగా మూడు డకౌట్లు నమోదు చేసిన అభిషేక్ శర్మపై వస్తున్న విమర్శలకు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గట్టిగా స్పందించాడు. అహ్మదాబాద్‌లో దక్షిణాఫ్రికాతో జరిగే సూపర్-8 మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన స్కై, జట్టు యాజమాన్యం అభిషేక్‌కు పూర్తి మద్దతుగా ఉందని స్పష్టం చేశాడు.


టోర్నీలో ఇప్పటివరకు పరుగుల ఖాతా కూడా తెరవలేకపోయిన అభిషేక్ శర్మపై విమర్శలు పెరుగుతున్న నేపథ్యంలో, సూర్య కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. “అభిషేక్ ఫామ్ గురించి ఆందోళన పడేవాళ్ల గురించే నేను టెన్షన్ పడుతున్నాను. అతను ఫామ్‌లోకి వస్తే ప్రత్యర్థి జట్లకు ఏమవుతుందో అందరికీ తెలుసు. ఇది టీమ్ గేమ్. గత ఏడాది అతను మాకు సహాయం చేశాడు, ఇప్పుడు మేము అతనికి అండగా ఉంటాం” అని సూర్య చెప్పాడు.


 అభిషేక్ స్థానంలో సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకోవాలన్న చర్చలపై కూడా సూర్య స్పష్టత ఇచ్చాడు. “పవర్‌ప్లేలో 40–50 పరుగులు సాధారణమే. ద్వైపాక్షిక సిరీస్‌ల్లో బాగా ఆడినందుకే అంచనాలు పెరిగాయి. ఇక్కడ పిచ్‌లు వేరుగా ఉన్నాయి. ఆఫ్ స్పిన్నర్లు తొందరగా బౌలింగ్‌కు వస్తున్నారు. అందుకే మేం దానికి తగ్గట్టు సిద్ధమవుతున్నాం” అని తెలిపాడు.


పవర్‌ప్లేలో భారీ స్కోర్లు లేకపోవడం వల్ల జట్టు ఇబ్బంది పడుతోందన్న విమర్శలను సూర్య ఖండించాడు. పరిస్థితులకు తగ్గట్టు వ్యూహాలు మార్చుకుంటూ ముందుకెళ్తున్నామని చెప్పాడు. అభిషేక్‌పై పూర్తి నమ్మకం ఉందని, అతను తన సహజ ఆట ఆడితే జట్టుకు మరింత బలం చేకూరుతుందని కెప్టెన్ స్పష్టం చేశాడు. సూపర్-8 దశలో భారత్ మరింత దూకుడుగా ఆడుతుందని కూడా సూర్య ధీమా వ్యక్తం చేశాడు.


మరోవైపు ఈ టోర్నీలో తిలక్ వర్మ కూడా పెద్దగా రాణించలేకపోయాడు. ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన తిలక్ ఇన్నింగ్స్‌ను నిదానంగా ముందుకు తీసుకెళ్లాడు. కానీ పెద్ద ఇంపాక్ట్ చూయించలేకపోయాడు.దాంతో తిలక్ వర్మ స్థానంలో సంజూ శాంసన్‌ను ప్లేయింగ్ 11లో తీసుకునే ఛాన్స్ ఉందనే వార్తలు కూడా వస్తున్నాయి. కానీ, సూపర్ 8లో సౌతాఫ్రికా, వెస్టిండీస్‌తో కీలక మ్యాచ్‌లు ఉండటంతో మార్పులు చేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa