ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రేయసితో రెండో పెళ్లి చేసుకున్న శిఖర్ ధావన్

sports |  Suryaa Desk  | Published : Sat, Feb 21, 2026, 10:39 PM

టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ తన ప్రేయసి సోఫీని వివాహం చేసుకున్నాడు. శనివారం ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతంలో జరిగిన ఈ పెళ్లి వేడుకను అత్యంత గోప్యంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రుల మధ్య ఈ వివాహం ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలను ధావన్ మాజీ సహచరుడు యుజ్వేంద్ర చాహల్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వెంటనే వైరల్ అయ్యాయి. అంతకుముందు, తన సంగీత్ నైట్ ఫొటోలను ధావన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ధావన్ – సోఫీ జంట జనవరిలోనే తమ నిశ్చితార్థాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. 2025లో వీరి ప్రేమ వ్యవహారం బహిర్గతమైంది. ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా దుబాయ్‌లో తొలిసారి వీరు కలిసి కనిపించారు.


 సోఫీ ఐర్లాండ్‌లో చదువుకుంది. మార్కెటింగ్ అండ్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పూర్తి చేసింది. ప్రస్తుతం ఆమె అబుదాబీలో ఉన్న నార్తన్ ట్రస్ట్ కార్పొరేషన్‌లో సెకండ్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. అంతేకాకుండా, శిఖర్ ధావన్ ఫౌండేషన్‌కు సంబంధించిన సేవా కార్యక్రమాలను కూడా ఆమె పర్యవేక్షిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షలాది ఫాలోవర్లు ఉన్న సోఫీ, ధావన్‌తో కలిసి అనేకసార్లు మ్యాచ్‌లకు హాజరవుతూ కనిపించింది.


ధావన్ గతంలో అయేషా ముఖర్జీని వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. అయితే, 2023లో వీరు విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు సోఫీతో వివాహం చేసుకోవడంతో, ధావన్ తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాడు. అభిమానులు, క్రికెట్ ప్రపంచం నుంచి ఈ జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.


శిఖర్ ధావన్ టీమిండియా తరఫున మొత్తం మూడు ఫార్మాట్లలో కలిపి 269 మ్యాచ్‌లు ఆడాడు. 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20ల్లో ధావన్ ప్రాతినిథ్యం వహించాడు. 2010లో తొలి వన్డే ఆడిన శిఖర్.. 2022లో చివరి మ్యాచ్ ఆడాడు. 2013లో టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చి 2018లోనే వీడ్కోలు పలికాడు. ఇక టీ20ల్లో 2011లో వెస్టిండీస్‌పై అరంగేట్రం చేసిన గబ్బార్.. 2021లో శ్రీలంక మీద చివరిసారిగా మ్యాచ్ ఆడాడు. ఆగస్టు 24, 2024న అధికారికంగా అంతర్జాతీయ, దేశీయ క్రికెట్ నుంచి శిఖర్ ధావన్ రిటైర్మెంట్ ప్రకటించాడు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa