దివంగత ప్రధాని రాజీవ్ గాంధీతో సూపర్ స్టార్ కృష్ణకు మంచి అనుబంధం ఉండేది. ఆయన ప్రభావంతో కృష్ణ రాజకీయాలలోకి కూడా రంగ ప్రవేశం చేశారు. విలక్షణమైన నటనతో ప్రేక్షకులను మెప్పించి, లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న సూపర్ స్టార్ కృష్ణ రాజకీయాల్లోనూ అడుగుపెట్టారు. రాజీవ్ గాంధీ పిలుపుతో కాంగ్రెస్ పార్టీలో చేరి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేశారు. రాజీవ్ గాంధీతో ఆయనకు మంచి స్నేహం కొనసాగిందని పాతతరం రాజకీయ నేతలు చెబుతుంటారు. 1972 లో జై ఆంధ్ర ఉద్యమానికి సూపర్ స్టార్ బహిరంగంగా మద్దతు ప్రకటించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం చేయడం, తెలుగుదేశం పార్టీ స్థాపించి ప్రజల్లోకి వెళ్లడం జరిగింది. ప్రజలు ఎన్టీఆర్ కు బ్రహ్మరథం పట్టారు. టీడీపీ ప్రభంజనం కొనసాగుతున్న ఆ టైమ్ లోనే కృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరి ఎన్నికలలో నిలబడ్డారు.
1989లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఏలూరు ఎంపీగా కృష్ణ బరిలో నిలబడ్డారు. టీడీపీ అభ్యర్థి బోళ్ల బుల్లి రామయ్యపై 71 వేల భారీ మెజారిటీ సాధించి, పార్లమెంట్ లో కృష్ణ అడుగుపెట్టారు. అయితే, రాజీవ్ గాంధీ హత్య తర్వాత చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు, మధ్యంతర ఎన్నికలలో ఓటమి తర్వాత ఆయన పాలిటిక్స్ కు దూరం జరిగారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తూనే వచ్చారు. 2004 ఎన్నికలలో వైఎస్ రాజశేఖర రెడ్డికి మద్దతు తెలిపారు. వైఎస్ మరణం తర్వాత జగన్ కు సపోర్ట్ గా ఉన్న కృష్ణ.. తర్వాతి కాలంలో రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు.