మన భారత దేశంలో ట్విట్టర్ యూజర్లకు సమస్యలు తలెత్తుతున్నాయి. తాజాగా పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించడంతో ట్విట్టర్ యూజర్లకు సమస్యలు ఎదురవుతున్నాయి. భారత్ లో ట్విట్టర్ యాప్ స్లోగా మారింది. దీనిపై సంస్థ అధినేత ఎలాన్ మస్క్ స్పందిస్తూ.. యూజర్లకు మంచి అనుభవాన్ని అందించేందుకు ట్విట్టర్ ఉద్యోగులు తీవ్రంగా శ్రమిస్తున్నారని తెలిపారు. భారత్, ఇండోనేషియా సహా చాలా దేశాల్లో ట్విట్టర్ యాప్ చాలా నిదానంగా ఉందని అంగీకరించారు. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని ప్రకటించారు.
భారత్ లో ట్విట్టర్ 90 శాతం ఉద్యోగులను తీసేయడం తెలిసిందే. ఇది సంస్థ పనితీరుపై ప్రభావం పడేలా చేసినట్టు తెలుస్తోంది. ట్విట్టర్ యాప్ వేగం తగ్గిపోవడంపై మస్క్ ఈ వారం మొదట్లో యూజర్లకు క్షమాపణలు కూడా చెప్పారు. ట్విట్టర్ ప్లాట్ ఫామ్ వేగాన్ని పెంచేందుకు తాను, ఉద్యోగులు ఎంతో కష్టపడుతున్నట్టు మస్క్ చెప్పారు. ‘‘యూఎస్ లో ట్విట్టర్ ప్రతి రెండు సెకన్లకు రీఫ్రెష్ అవుతోంది. అదే భారత్ లో ఇందుకు 10-20 సెకన్ల సమయం తీసుకుంటోంది. కొన్ని దేశాల్లో 30 సెకన్ల వరకు సమయం పడుతోంది’’ అని మస్క్ తెలిపారు.