టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్విట్టర్ బాధ్యతలు చేపట్టాక ఆ సంస్థంలోని ఉద్యోగులకు భద్రత కరువైంది. ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేసిన తర్వాత.. సంస్థ ఉద్యోగులకు కంటి నిండా నిద్ర లేకుండా పోయిందని చెప్పవచ్చు. దాదాపు సగం మంది ఉద్యోగులను ఆయన పీకి పారేశారు. దీంతో ఉన్న ఉద్యోగులపై పని భారం మొత్తం పడింది. అంతేకాదు, దీనికి అదనంగా అద్భుతమైన, అసాధారణ పనితీరు చూపించాలంటూ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేశారు. ట్విట్టర్ 2.0 ను నిర్మించేందుకు ఉద్యోగులు ఎంతో కష్టపడి చేయాల్సిందేనని స్పష్టం చేశారు. లేదంటే మూడు నెలల పాటు వారికి ఎటువంటి వేతనాలు చెల్లించేది లేదని తేల్చి చెప్పారు. ఈ మేరకు ఉద్యోగులకు ఈ మెయిల్ పంపించారు.
‘‘ట్విట్టర్ 2.0 ఆవిష్కరణకు, ఎంతో పోటీతో కూడిన ప్రపంచంలో విజయంతంగా రాణించేందుకు మనం ఎంతో కష్టపడాలి. దీని కోసం ఎక్కువ గంటల పాటు, ఉత్సాహంతో పనిచేయాలి. ప్రత్యేకమైన పనితీరుతోనే దీన్ని అధిగమించగలం. ట్విట్టర్ ఇంజనీరింగ్ ఆధారితంగా పనిచేసే ప్లాట్ ఫామ్ గా ఉండాలి. డిజైన్, ఉత్పత్తుల మేనేజ్ మెంట్ ఎంతో కీలకం. కొత్త ట్విట్టర్ లో భాగం కావాలని మీరు కచ్చితంగా భావిస్తుంటే కింద ఉన్న లింక్ పై యస్ అని క్లిక్ చేయండి. గురువారం సాయంత్రం 5 గంటల వరకు యస్ చెప్పని వారికి మూడు నెలల పాటు తొలగింపు ఉంటుంది’’అంటూ మస్క్ ఈ మెయిల్ లో తెలిపారు. అసాధారణ పనితీరుతో కూడిన ప్రతిభావంతులనే అట్టి పెట్టుకుని, ట్విట్టర్ ను సరికొత్తగా తీర్చిదిద్దే సంకల్పంతో మస్క్ ఉన్నట్టు కనిపిస్తోంది.