కర్నూలు జిల్లాలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాక నేపథ్యంలో వైసీపీ...టీడీపీ నేతల మధ్య యుద్దవాతావరణం నెలకొంది. చంద్రబాబునాయుడు ఇవాళ కర్నూలు పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యాలయం వద్దకు చేరుకుని చంద్రబాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. మూడు రాజధానులు కావాలంటూ నినాదాలతో హోరెత్తించారు. దాంతో టీడీపీ కార్యకర్తలు స్పందించి, సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
అంతలో టీడీపీ ఆఫీసు వద్దకు చంద్రబాబు చేరుకోవడంతో నినాదాల జోరు పెరిగింది. వైసీపీ శ్రేణులు చంద్రబాబు కాన్వాయ్ ని అడ్డుకునే ప్రయత్నం చేశాయి. ఓ దశలో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో, చంద్రబాబు తీవ్రస్థాయిలో స్పందించారు.
పేటీఎం బ్యాచ్ కు బిర్యానీ పొట్లాలు ఇచ్చి రెచ్చగొట్టి పంపారని మండిపడ్డారు. రాయలసీమలో ముఠా నేతలను అణచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ... మిమ్మల్ని అణచివేయడం ఓ లెక్కా! అని మండిపడ్డారు. ఈ రాత్రికి ఇక్కడే ఉంటాను... మీ సంగతి తేలుస్తా అని హెచ్చరించారు.