ప్రత్యర్థి పార్టీల విమర్శలను అస్త్రాలుగా మల్చుకొనే వ్యూహాన్ని అమలు చేసేందుకు అధికార వైసీపీ సిద్దమవుతోంది. వచ్చే ఎన్నికలలో ఇది కూడా ఓ అస్త్రంగా చేపట్టాలని భావిస్తోంది. 2019 ఎన్నికలకు ముందు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి.. అనేక హామీలు ఇచ్చారు. తాను అధికారంలోకి వచ్చాక.. అన్నీ అమలు చేస్తానని చెప్పారు. దీంతో ఆ ఎన్నికల్లో జగన్‌ను ప్రజలు ఆశీర్వదించారు. అటు.. ఇప్పటివరకు దాదాపు 98 శాతం హామీలను అమలు చేశామని.. రాష్ట్రాన్ని సంక్షేమాంధ్రప్రదేశ్‌గా మార్చామని జగన్ చెబుతూ వస్తున్నారు. నవరత్నాలు పేదలకు వరంగా మారాయని చెబుతున్నారు. అయితే.. ప్రభుత్వం ఏం చెప్పినా.. ప్రతిపక్షాలు మాత్రం నవరత్నాలు.. నవ మోసాలు అని ఆరోపించాయి.
కానీ.. తాజాగా ప్రతిపక్షాల స్వరం మారినట్టు కనిపిస్తోంది. ఇటీవల పలుచోట్ల జరిగిన సభల్లో చంద్రబాబు సంక్షేమ కార్యక్రమాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. 'తాను అధికారంలోకి వస్తే.. ఇప్పుడున్న సంక్షేమ కార్యక్రమాలు ఆపేస్తామని ప్రచారం చేస్తున్నారు. అలా అస్సలు జరగదు. సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తా' అని చంద్రబాబు స్పష్టం చేశారు. చంద్రబాబు కామెంట్స్ అలా అంటే.. ఇటీవల విజయనగరంలో మాట్లాడిన పవన్ కూడా దాదాపు అలాంటి వ్యాఖ్యలే చేశారు. 'తాము అధికారం లోకి వస్తే.. ఏ సంక్షేమ పథకాలు ఆపబోం' అని పవన్ స్పష్టం చేశారు.
వీరిద్దరు చేసిన కామెంట్స్ ఇప్పుడు వైసీపీకి ఆయుధంగా మారాయి. పరోక్షంగా జగన్ అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు బాగున్నాయని ఒప్పుకున్నాక.. ఇక మీకెందుకు ఓటు వేయాలని వైసీపీ ప్రశ్నిస్తోంది. ఇన్ని పథకాలు ప్రవేశపెట్టిన జగన్‌ను కాదని.. ప్రజలు మీకెలా ఓటు వేస్తారని అధికార పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అక్కడితో అగకుండా.. పవన్, చంద్రబాబు సంక్షేమ పథకాల గురించి మాట్లాడిన వీడియోలను విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు. జగన్ పథకాలను ప్రత్యర్థులు కూడా మెచ్చుకుంటున్నారని కామెంట్స్ పెడుతున్నారు.