ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతోమంది సలహాదార్లను నియమించి తాజాగా మరోసారి సలహాదారును నియమించింది. తాజాగా స్త్రీ శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా నారమల్లి పద్మజను నియమిస్తూ ఉత్తర్వలు ఇచ్చారు. ప్రభుత్వం ఈ మేరకు గురువారం ఓ జీవోను విడుదల చేసింది. మహిళా అభివృద్ధి, శిశుసంక్షేమ శాఖలో సలహాదారుగా ఆమె నియామకం తక్షణమే అమలులోకి వస్తుందని జీవోలో పేర్కొన్నారు. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రెటరీ ఏఆర్ అనురాధ పేరిట ఆ జీవో విడుదల అయ్యింది.
పద్మజ గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. ఆ తర్వాత వైఎస్సార్‌సీపీలో చేరారు. అప్పటి నుంచి పార్టీ కోసం పద్మజ పని చేశారు. అంతేకాదు ఆమె చిత్తూరు మాజీ ఎంపీ దివంగత శివప్రసాద్ సోదరి. నారమల్లి పద్మజ వైఎస్సార్‌సీపీలో కూడా కీలక నేతగా ఉన్నారు. పార్టీ అధికార ప్రతినిధిగా పార్టీ తరపున వాయిస్ వినిపిస్తున్నారు. అంతేకాదు 2019లో చిత్తూరు జిల్లాలోని ఓ స్థానం నుంచి టికెట్ ఆశించారు. కొన్ని సమీకరణాలతో దక్కలేదని అప్పట్లో చర్చ జరిగింది.