కడప జిల్లాలో పారిశ్రామిక ప్రగతికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. కొత్త పరిశ్రమలు నెలకొల్పడంతోపాటు వాటికి అవసరమైన మౌలిక వసతులను యుద్ధప్రాతిపదికన సమకూరుస్తోంది. ప్రధానంగా పరిశ్రమలకు నీటిని తరలించే ప్రక్రియను వేగవంతం చేసింది. జిల్లావ్యాప్తంగా ఏర్పాటవుతున్న కొత్త పరిశ్రమలకు జీఎన్‌ఎస్‌ఎస్ పరిధిలోని సాగునీటి వనరుల నుంచి, తెలుగుగంగ పరి«ధిలోని ప్రాజెక్టుల నుంచి నీటి కేటాయింపులు చేస్తోంది. దీంతోపాటు ఆయా ప్రాజెక్టుల నుంచి పరిశ్రమలకు గ్రావిటీ, పైపులైన్ల ద్వారా నీటిని తరలించేప్రక్రియను మరింత వేగవంతం చేసింది. తాజాగా కొప్పర్తి పారిశ్రామికవాడకు బ్రహ్మంసాగర్ నుంచి నీటిని తరలించే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం రూ. 100.18 కోట్లతో ప్రత్యేక పైపులైన్ నిర్మాణానికి సిద్ధమైంది. ఇప్పటికే సదరు పనులకు ప్రభుత్వం టెండర్లు పిలిచింది. టెండరు ప్రక్రియ ముగిసిన అనంతరం పనులు మొదలు కానున్నాయి. 80 సెంటీమీటర్ల విస్తీర్ణంతో మైదుకూరు నుంచి కొప్పర్తి వరకు 32.4 కిలోమీటర్ల మేర కొత్త పైపులైన్ నిర్మిస్తున్నారు. ఈ పైపులైన్ ద్వారా 46 ఎంఎల్‌డీ (మిలియన్ లీటర్ ఫర్ డే) చొప్పున నీటిని తరలించనున్నారు.