ఇంటి ఇల్లాలికి మద్దతుగా ఆమెకు ఆర్థిక ప్రయోజనం దక్కేవిధంగా సంక్షేమ పథకాలు వర్తింప జేస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. కుటుంబ ఉన్నతికి పాటుపడే తల్లికి ఆర్థిక అండ అందించేందుకే సంక్షేమ పథకాలు వర్తింపు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం నేరుగా మహిళల ఖాతాల్లో డీబీటీ ద్వారా డబ్బులు జమ చేస్తున్నామని, ఎక్కడా అవినీతికి, లంచాలకు తావు లేదన్నారు. శుక్రవారం బాదుర్లపేటలో మంత్రి ధర్మాన ప్రసాదరావు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. బాదుర్లపేట సచివాలయం పరిధిలో ఆయన ఇంటింటికీ తిరిగి, పథకాల అమలు తీరును లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా స్థానిక సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి ధర్మాన మాట్లాడుతూ.. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఏర్పాటయిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు కావడంతో పాలనకు సంబంధించి ప్రజాభిప్రాయం ఏ విధంగా ఉందో తెలుసుకునేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు వివిధ సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టాం. వాటి అమలు ఎలా ఉందో తెలుసుకునేందుకే గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం.ఎన్నికలకు ముందు మాకు ఓటు వేస్తే ఏం చేస్తామో చెప్పాం. వాటికి ఆచరణ రూపం ఇస్తూ పలు పథకాలు తీసుకువచ్చాం. వాటికి సంబంధించి లబ్ధిదారులు ఏమనుకుంటున్నారో అన్నది ముఖ్యం. ఒకవేళ తప్పిదాలు ఉంటే దిద్దుకుంటాం. గతంలో ఏ ప్రభుత్వం అయినా ఈ విధంగా చేయగలిగిందా ? ఈ విధంగా చేయాలంటే ఎంత ధైర్యం కావాలి. ధైర్యం అంటే మొండి ధైర్యం అని కాదు. చెప్పింది చేయగలిగి తరువాత చేశామా లేదా అన్నది ముఖ్యం. ఇవన్నీ ఎన్నికల కోసం చేస్తున్నవి కావు అని తెలియజేసారు.