అనంతపురం జిల్లా, యాడికి, మండల పరిధిలోని రాయలచెరువు వేదవతి పాఠశాలలో ఉపాధ్యాయుడు, ఏడో తరగతి విద్యార్థిని చితకబాదాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వెంగన్నపల్లికి చెందిన నల్లపురెడ్డి కుమారుడు గురునాథ్‌రెడ్డి వేదవతి పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. గురునాథ్‌రెడ్డి డైరీలో తప్పులు రాశాడని గణిత ఉపాధ్యాయుడు ఫైబర్ స్టిక్‌తో శుక్రవారం విచక్షణారహితంగా కొట్టాడు. దీంతో విద్యార్థి కాలు, చేయిపై వాతలు తేలాయి. బాధిత విద్యార్థి సాయంత్రం ఇంటికి వెళ్లి విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేశాడు. దీంతో వారు డాక్టర్ వద్దకు తీసుకువెళ్లి చికిత్స చేయించారు. శనివారం ఉదయం పాఠశాల వద్దకు చేరుకుని, కరస్పాండెంట్ నాగేంద్రను విద్యార్థి తండ్రి నిలదీశాడు. విద్యార్థులను చితకబాదిన ఉపాధ్యాయుడిని పాఠశాల నుంచి తొలగించామని కరస్పాండెంట్ నాగేంద్ర తెలిపారు.