పెడన నియోజకవర్గం గూడూరు మండలం ప్రధానసెంటర్ సమీపంలో సీఎం జగన్ భారీ కటౌట్‌ను గుర్తుతెలియని వ్యక్తులు శనివారం తెల్లవారుజామును ధ్వంసం చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ శ్రేణులు మచిలీపట్నం-విజయవాడ జాతీయరహదారిపై బైఠాయించి నిందితులను శిక్షించాలని రాస్తారోకో చేశారు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, మంత్రి జోగి రమేశ్, జడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక, స్థానిక నేతలు సంఘటనా స్థలానికి చేరుకుని రాస్తారోకోను విరమింపచేశారు. నిందితులను గుర్తించి అరెస్ట్టు చేయాలని ఎంపీ, మంత్రి బందరు డీఎస్పీ మాసుం బాషాకు సూచించారు. శనివారం గూడూరులో సీఎం కటౌట్ ధ్వంసం చేయడంతో నియోజకవర్గంలో పరిస్థితులు ఉద్రిక్తతకు దారితీశాయి. కటౌట్ ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కారుమంచి కామేశ్వరరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.