ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పరీక్షా కేంద్రంలో పదో తరగతి విద్యార్థిని ప్రసవం

national |  Suryaa Desk  | Published : Thu, Feb 26, 2026, 03:51 PM

మధ్యప్రదేశ్‌లో అత్యంత విస్తుపోయే ఘటన చోటుచేసుకుంది. పదో తరగతి బోర్డు పరీక్ష రాస్తున్న ఓ మైనర్ విద్యార్థిని, పరీక్షా కేంద్రంలోని వాష్‌రూంలోనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ అనూహ్య సంఘటనతో పరీక్షా కేంద్రంలో తీవ్ర కలకలం రేగింది. ధార్ జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతమైన పిథాంపూర్‌లో మంగళవారం ఈ ఘటన జరిగింది.వివరాల్లోకి వెళితే... పిథాంపూర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో పదో తరగతి గణితం పేపర్ రాస్తున్న విద్యార్థినికి మధ్యలో తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. ఇన్విజిలేటర్ అనుమతితో ఆమె వాష్‌రూంకు వెళ్లింది. అయితే, చాలాసేపటికీ తిరిగి రాకపోవడంతో పాటు లోపలి నుంచి పసికందు ఏడుపు వినిపించడంతో సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. తలుపులు తెరిచి చూడగా, విద్యార్థిని బిడ్డను ప్రసవించి ఉండటం చూసి నిశ్చేష్టులయ్యారు.వెంటనే పరీక్షా కేంద్రం యాజమాన్యం 108 అంబులెన్స్‌కు సమాచారం అందించింది. తల్లీబిడ్డను హుటాహుటిన స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.ఈ ఘటనపై పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాధితురాలు ఇండోర్ జిల్లాలోని బెత్మా ప్రాంతానికి చెందినది కావడంతో కేసును అక్కడి పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేసినట్లు ధార్ ఏఎస్పీ విజయ్ దబూర్ మీడియాకు వెల్లడించారు. విచారణలో భాగంగా గత రెండేళ్లుగా ఓ యువకుడితో పరిచయం ఉన్నట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఆమె వాంగ్మూలం ఆధారంగా నిందితుడిని గుర్తించామని, త్వరలోనే అతడిని అరెస్ట్ చేస్తామని పోలీసులు పేర్కొన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa