ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్త రాజకీయ పార్టీ పెట్టనున్న వి.కె. శశికళ

national |  Suryaa Desk  | Published : Thu, Feb 26, 2026, 04:11 PM

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వి.కె. శశికళ తన రాజకీయ పునరాగమనాన్ని ఖాయం చేస్తూ కీలక ప్రకటన చేశారు. వారం రోజుల్లో తన కొత్త రాజకీయ పార్టీ పేరును వెల్లడిస్తానని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ క‌చ్చితంగా పోటీ చేస్తుందని ఆమె స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో తమిళనాడు రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది.చెన్నై విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడిన ఆమె, పార్టీ ప్రారంభానికి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. "వారం రోజుల్లో పార్టీ పేరు ప్రకటిస్తాం. పొత్తుల కోసం కూడా చర్చలు జరుపుతున్నాం. ఈ చర్చలు కచ్చితంగా ఒక మంచి నిర్ణయానికి దారితీస్తాయి" అని శశికళ పేర్కొన్నారు. అయితే, ఏ పార్టీలతో చర్చలు జరుపుతున్నారనే వివరాలను వెల్లడించడానికి ఆమె నిరాకరించారు. ఈ వ్యాఖ్యలతో తమిళనాట రాజకీయ ఊహాగానాలు మళ్లీ మొదలయ్యాయి.ఎన్నికలకు తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో కొత్త పార్టీ నిర్మాణం సవాలుగా మారదా? అని విలేకరులు ప్రశ్నించగా శశికళ ధీమా వ్యక్తం చేశారు. తన రాజకీయ ప్రస్థానం, ప్రజా జీవితం గురించి తమిళనాడు ప్రజలకు బాగా తెలుసని, కాబట్టి పార్టీకి ప్రజల మద్దతు కూడగట్టడం పెద్ద కష్టమేమీ కాదని ఆమె అభిప్రాయపడ్డారు. 2026 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శశికళ ప్రకటనను రాజకీయ విశ్లేషకులు ఒక ముఖ్యమైన పరిణామంగా చూస్తున్నారు. ఇప్పటికే ప్రధాన పార్టీలు క్షేత్రస్థాయిలో కసరత్తు ముమ్మరం చేసిన తరుణంలో శశికళ రాకతో కొత్త రాజకీయ సమీకరణాలు, పొత్తుల వ్యూహాలు తెరపైకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa