అమెరికాలోని ఒమాహా నగరంలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద రోడ్డు ఉన్నట్టుండి కుంగిపోయి, భారీ గుంత ఏర్పడింది. ఆ సమయంలో రెడ్ సిగ్నల్ పడడంతో అక్కడ ఆగిన రెండు కార్లు గుంతలో పడిపోయాయి. అయితే, అదృష్టవశాత్తూ అందులోని ప్రయాణికులకు పెద్దగా గాయాలు కాలేదు. ఈ ఘటన మొత్తం అక్కడున్న సీసీటీవీ కెమెరాలలో రికార్డైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే..ఒమాహా సిటీలోని 67వ, పసిఫిక్ వీధుల జంక్షన్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్ పడటంతో వాహనాలు ఆగుతున్న సమయంలో ఒక్కసారిగా రోడ్డు కుంగిపోయి భారీ గుంత ఏర్పడింది. ఈ అనూహ్య ఘటనలో ఒక మెరూన్ కలర్ జీప్ ఎస్యూవీ, ఒక సిల్వర్ కలర్ డాడ్జ్ రామ్ పికప్ ట్రక్కులు ఆ గుంతలో పడిపోయాయి. మంగళవారం మధ్యాహ్నం సుమారు 3:30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అత్యవసర సేవా సిబ్బంది అక్కడికి చేరుకునేలోపే, ఆ రెండు వాహనాల్లోని డ్రైవర్లను తోటి వాహనదారులు కాపాడారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.భూగర్భంలో నీటి పైపులైన్ లీక్ కావడం వల్ల లోపల మట్టి కోతకు గురై, పైన ఉన్న రోడ్డుకు పట్టు కోల్పోవడమే ఈ సింక్ హోల్ ఏర్పడటానికి ప్రధాన కారణమని సిటీ ఇంజనీర్ ఆస్టిన్ రోజర్ తెలిపారు. గుంత మరింత విస్తరించే అవకాశం ఉన్నందున ఆ ప్రాంతానికి ఎవరూ రావద్దని పోలీసులు హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa