రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి కష్టాలు ముదురుతున్నాయి. మనీలాండరింగ్, బ్యాంక్ లోన్ల మోసం కేసులో గురువారం ఆయన ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. సరిగ్గా ఒకరోజు ముందే ముంబైలోని ఆయన విలాసవంతమైన నివాసం ‘అబోడ్’ను ఈడీ జప్తు చేయడం గమనార్హం. ముంబైలోని పాలి హిల్ ప్రాంతంలో ఉన్న 17 అంతస్తుల ఈ భవనం విలువ సుమారు రూ.3,716 కోట్లు ఉంటుందని అంచనా. రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్ కామ్) సంస్థకు సంబంధించిన బ్యాంక్ రుణాల మళ్లింపు, నిధుల దుర్వినియోగం ఆరోపణలపై 66 ఏళ్ల అనిల్ అంబానీని అధికారులు రెండో విడత విచారించారు.ఒకప్పుడు ప్రపంచ కుబేరులలో ఒకరిగా ఉన్న అనిల్ అంబానీ, గత రెండు దశాబ్దాలుగా తన వ్యాపార సామ్రాజ్యంలో వరుస నష్టాలను ఎదుర్కొంటున్నారు. విద్యుత్ నుండి రక్షణ రంగం వరకు విస్తరించిన ఆయన వ్యాపారాలు ప్రస్తుతం దర్యాప్తు సంస్థల నిఘాలో ఉన్నాయి. తాజాగా ఈడీ జరిపిన ఈ ఆస్తుల అటాచ్మెంట్ మరియు సుదీర్ఘ విచారణ పారిశ్రామిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముకేశ్ అంబానీ తమ్ముడిగా అందరికీ తెలిసిన అనిల్.. ఇప్పుడు తన ఉనికిని కాపాడుకునేందుకు న్యాయపరమైన పోరాటం చేస్తున్నారు. ఈ కేసులో తదుపరి చర్యలు ఎలా ఉంటాయనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa