భారతదేశ సంస్కృతిని తప్పనిసరిగా పిల్లలకు నేర్పాలని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ అన్నారు. క్రియ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి అంతర పాఠశాలల పిల్లల క్రియ పండుగ పోటీలు శనివారం కాకినాడ జేఎన్టీయూకేలో శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పాఠశాలల నుంచి 8,400 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన జయప్రకాశ్ నారాయణ మాట్లాడుతూ.. చిన్నారుల్లో విజ్ఞానాన్ని పెంపొందించేవిధంగా ఏటా క్రియ పండుగ నిర్వహించడం అభినందనీయమన్నారు. మనిషి మనుగడతోపాటు భవిష్యత్ తరాలను తీర్చిదిద్దేది చదువొక్కటేనని స్పష్టంచేశారు. ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం వల్ల విద్యార్థుల్లో విజ్ఞానం వికసిస్తుందన్నారు. ప్రతీ జిల్లాలోనూ ఇటువంటి పోటీలు నిర్వహించాలని ఆయన సూచించారు.