ఓ చర్చీ ఫాదర్ చర్యలు ప్రస్తుతం చర్చాంశనీయంగా మారాయి. కృష్ణా జిల్లా గన్నవరం మండలం గొల్లనపల్లిలో ఓ పాస్టర్ తన వింత ప్రవర్తనతో కుటుంబ సభ్యులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాడు. అతడి పేరు నాగభూషణం. ఆయనకు సొంత చర్చి కూడా ఉంది. అయితే కొన్నిరోజులుగా ఆయన ప్రవర్తనలో మార్పు కనిపిస్తోంది. దేవుడు తనతో మాట్లాడుతున్నాడని, పరలోకానికి రమ్మంటున్నాడని చెబుతున్నాడు.
అంతేకాదు, ఓ గొయ్యి తీసి తనను అందులో పూడ్చివేస్తే, దేవుడు మూడ్రోజుల్లో లేచి తిరిగొచ్చినట్టు, తాను కూడా లేచి వస్తానని అంటున్నాడు. ఈ క్రమంలో, తన చర్చిలోనే ఓ గొయ్యి తవ్విస్తుండడంతో అందరిలోనూ ఆందోళన బయల్దేరింది. దీనిపై గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సదరు పాస్టర్ ను విచారిస్తున్నారు. గత పది రోజుల నుంచి ఇలాగే ప్రవర్తిస్తున్నాడని పాస్టర్ నాగభూషణం కుటుంబ సభ్యులు వాపోయారు.