ప్రముఖ సింగర్ సత్యవతి మంగ్లీ రాథోడ్‌కు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) సలహాదారుగా మంగ్లీని నియమిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అనంతపురం జిల్లా గుత్తి మండలం, బసినేపల్లె తాండకు చెందిన మంగ్లీ.. బోనాలు పాటలతో ఫేమస్ అయ్యారు. కంచు కంఠంతో శ్రోతలను ఉర్రూతలూగించేలా పాటలు పాడుతూ అశేష అభిమానులను సంపాదించుకున్నారు.
తొలుత జానపద గీతాలతో ఫేమస్ అయిన మంగ్లీ.. తర్వాత సినిమాల్లోనూ సింగర్‌గా బిజీ అయ్యారు. గత ఎన్నికలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పాడిన పాటలు బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూడా గతంలో మంగ్లీ కలిశారు.
ఎన్నికలు మరో ఏడాదిన్నరలో రానున్న తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. మంగ్లీకి ఎస్వీబీసీ చానల్ సలహాదారుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రెండేళ్ల పాటు మంగ్లీ ఈ పదవిలో కొనసాగనున్నారు. కాగా, తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖ నటులకు కూడా ఇటీవలే సీఎం జగన్ కీలక పదవులు కట్టబెట్టారు. నటుడు పోసాని కృష్ణమురళిని ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించారు. అలాగే, ప్రముఖ కమెడియన్ ఆలీని ఏపీ ఎలక్ట్రానికి మీడియా సలహాదారు పదవి వరించింది. తాజాగా, మంగ్లీని ఎస్వీబీసీ చానల్ సలహాదారుగా నియమించారు. మరో ఏడాదిన్నలో రాష్ట్రంలో ఎన్నికలు రానున్న తరుణంలో వీరి సేవలను మరింతగా ఉపయోగించుకోవడం కోసమే ఈ నియామకాలు చేపట్టినట్లు తెలుస్తోంది.