ఆక్వా యూనివర్శిటీ మత్స్యకారుల జీవితాల్లో మార్పు తీసుకొస్తుందని పశు సంవర్ధక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో పలు అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవంతో పాటు వివిధ అభివృద్ది పనులకు సీఎం వైయస్ జగన్ శంకుస్ధాపనలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా సీఎంగారు ఇక్కడికి వచ్చి మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం శుభపరిణామం. గతంలో ఏ నాయకుడు కూడా మత్స్యకారుల జీవితాల్లోకి తొంగిచూసిన పరిస్ధితి లేదు. సముద్రంలోకి వెళ్ళి ఉప్పునీటి మీద తిరిగొస్తామో లేదో అన్నటువంటి సందర్భం నుంచి ఈ రోజు నేను విన్నాను, నేను ఉన్నాను అనే వరకూ సాగింది. సీఎం హోదాలో మత్స్యకారుల తోలు తీస్తాం, ఫినిష్ చేస్తామన్న వారి నుంచి మత్స్యకారులను అక్కున చేర్చుకున్న ప్రతి అంశంలో కూడా వారిని ముందుపెడుతున్న ఈ సీఎం వరకూ చూస్తున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే చెప్పిన ప్రతి హామీని నెరవేర్చిన సీఎం మన ముందు ఉన్నారు. మత్స్యకార భరోసా, డీజిల్ సబ్సిడీ, ఎక్స్గ్రేషియా ఇలా ప్రతి మత్స్యకారుడికి అన్ని పథకాలు అందజేస్తున్న ప్రభుత్వం ఇది అని తెలియజేసారు.