తెలుగుదేశం అనబడే ఒక రాజకీయ పార్టీని కొన్ని పత్రికలు, టీవీలు నడుపుతున్నట్టుగా వారి బ్యానర్ స్టోరీలు చూస్తేనే అర్థం అవుతుందని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. నిన్నటి రోజున సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎక్కడా స్పందించలేదని, కానీ ఎల్లో మీడియా మాత్రం ఎగబడి మరీ శీర్షికలు ప్రచురించిందన్నారు. రాజధానిపై సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని చెప్పారు. రాజధాని రైతులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని, వారికి అన్ని విధాలుగా తోడుగా ఉంటుందని చెప్పారు. అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరిగేలా ఎవరికీ అభ్యంతరం లేని పకడ్బందీ చట్టాన్ని తీసుకొస్తామని చెప్పారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీస్ ఆవరణలోని మీడియా పాయింట్ వద్ద సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.