కర్నూలులో కచ్చితంగా హైకోర్టు సాధిస్తామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కర్నూలులో హైకోర్టు సాధించేంత వరకు ఉద్యమం ఆగదని అన్నారు. యువత, రైతులు, ఈ ప్రాంత భవిష్యత్తు, గౌరవం కోసం హైకోర్టును తీసుకువచ్చేందుకు పోరాటం జరుగుతుందని అన్నారు. కర్నూలు మొత్తం 10 కిలోమీటర్ల వరకు అందరికీ కనిపించేలా జగన్నాథ గట్టుపై హైకోర్టు నిర్మాణం జరుపుతామని బుగ్గన వెల్లడించారు.
కర్నూలు ఎస్టీబీసీ కళాశాల మైదానంలో వైసీపీ ఆధ్వర్యంలో రాయలసీమ గర్జన సభ నిర్వహించారు. ఈ సభకు వైసీపీ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అంజాద్ బాషా, గుమ్మనూరు జయరాం, రాయలసీమ ప్రాంతానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.
సీమ గర్జన సభలో బుగ్గన ప్రసంగించారు. నాడు రాజధానిని కర్నూలు ప్రజలు త్యాగం చేశారని, 1956లో కర్నూలు నుంచి రాజధానిని హైదరాబాద్ తరలించారని వివరించారు. అప్పటి నుంచి రాయలసీమ వెనుకబడిపోయిందని అన్నారు. ఈ క్రమంలో ఆయన విపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఇప్పుడీ ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశం వచ్చిందని, సీఎం జగన్ రాయలసీమకు హైకోర్టు ఇస్తానంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చంద్రబాబుకు ఇష్టం ఉందో, లేదో చెప్పాలని బుగ్గన డిమాండ్ చేశారు. ఏపీలో అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలన్నదే సీఎం జగన్ ఆశయం అని వెల్లడించారు. వికేంద్రీకరణ ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజలు కూడా గుర్తించారని వివరించారు.