రాయలసీమ ప్రజల ఆకాంక్షల మేరకు ముఖ్యమంత్రి జగన్ రాజధాని వికేంద్రీకరణను చేపడుతున్నారని ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాలనే కోరిక ప్రజలలో బలంగా ఉందని... వారిలో ఉన్న కోరికను చూసి ఆశ్చర్యపోతున్నామని ఆయన అన్నారు. కర్నూలులో నిర్వహించిన రాయలసీమ గర్జన సభలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రాయలసీమకు న్యాయం చేసేందుకు ముఖ్యమంత్రి యత్నిస్తుంటే టీడీపీ అధినేత చంద్రబాబు అడ్డుపడుతున్నారని విమర్శించారు. తన మనుషులతో కోర్టులో కేసులు వేయిస్తూ కర్నూలుకు హైకోర్టు రాకుండా చేయాలని చూస్తున్నారని అన్నారు. రాయలసీమ గురించి మాట్లాడే అర్హత కూడా చంద్రబాబుకు లేదని చెప్పారు. రాయలసీమలో నీటి ప్రాజెక్టులను చేపట్టింది రాజశేఖరరెడ్డి అని కొనియాడారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేదే జగన్ ఆకాంక్ష అని... అందుకే అమరావతితో పాటు అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ప్రాంతాల మధ్య విభేదాలు రాకూడదనే వికేంద్రీకరణ నిర్ణయాన్ని తీసుకున్నామని తెలిపారు.