ఈ రాష్ట్రానికి పట్టిన శని పోవాలంటే వైసీపీ ప్రభుత్వం పోవాలని రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి అన్నారు. విలీన మండలాల టీడీపీ నాయకులు, కార్యకర్తలతో గౌరిదేవి పేట గ్రామంలో మన రాష్ట్రానికి ఇదేం ఖర్మ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో రాజేశ్వరి మాట్లాడారు. మళ్లీ టీడీపీ వస్తేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని, లేకుంటే రాష్ట్రం అంధకారంగా మారుతుందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిననాటి నుంచి రాష్ట్రంలో ఏ వర్గం ప్రజలు సంతోషంగా లేరన్నారు. మరో పక్క ప్రభుత్వ పెద్దల వేధింపులతో రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఎదుర్కొంటున్న సమస్యలను ప్రతీ కార్యకర్త ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం మన రాష్ట్రానికి ఇదేం ఖర్మ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లభనేని చందు, వైస్ ఎంపీపీ దొంతు మంగేశ్వరరావు, మండలాధ్యక్షుడు పుట్టి రమేష్, అరకు రైతు సంఘం అధ్యక్షుడు కానూరి బుల్లెబ్బాయి, నాయకులు మధు పాల్గొన్నారు.