ఎలక్ర్టిక్ బస్సులో ప్రయాణమెలా ఉందని ప్రయాణికులను ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ప్రశ్నించారు. తిరుమలకు వెళుతున్న ఆయన మార్గమధ్యంలోని అలిపిరి బాలాజీ బస్టాండులోని ఓ ఎలక్ర్టిక్ బస్సును సోమవారం సాయంత్రం పరిశీలించారు. అనంతరం బస్సులోకి ఎక్కి ప్రయాణికులతో కాసేపు ముచ్చటించారు. శబ్ద, వాయు రహితంగా ఉండటంతోపాటు ఇంధనం ఖర్చు తగ్గుతుందని భావించి అత్యాధునిక పరిజ్ఞానంతో ఆకర్షణీయంగా ఈ బస్సును తీసుకురావడం జరిగిందన్నారు. నూతన అనుభూతి కలుగుతోందని, సౌకర్యంగా ఉందని ప్రయాణికులు తెలిపారు. అనంతరం ఎలక్ర్టిక్ బస్సు చార్జింగ్ స్టేషన్ వద్దకెళ్లారు. కంపెనీ ప్రమాణాల ప్రకారం నిర్దేశించిన సమయంలోనే బస్సులకు చార్జింగ్ అవుతోందా.. రోజుకు ఎన్ని ట్రిప్పులు నడుపుతున్నారని ఆరా తీశారు. ఈ నెలాఖరుకు ఎన్ని బస్సులు రావచ్చని మేగా ఇంజనీరింగ్ ఇన్‌ఫ్రాస్టక్చర్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. అలిపిరి డిపో పరిధిలో ఈ ఏడాది శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రతిభ చూపిన కండక్టర్లుకు, డ్రైవర్లకు, గ్యారేజీ సిబ్బందికి, మెకానిక్స్‌కు ప్రశంసాపత్రాలు అందజేశారు. అనంతరం తిరుమలకు బయల్దేరి వెళ్లారు. రాత్రికి బసచేసి మంగళవారం ఉదయం శ్రీవారిని దర్శించుకుని కడపకు వెళ్లనున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ప్రధాన కార్యాలయ ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బ్రహ్మానందరెడ్డి, కడపజోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గోపీనాథ్‌రెడ్డి, జిల్లా ప్రజారవాణా అధికారి చెంగల్‌రెడ్డి, అధికారులు భాస్కర్, నరసింహులు, హరిబాబు, విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.