వైసీపీ ప్రభుత్వాన్ని ఇక భరించే పరిస్థితి లేదని, ఇక గద్దె దించి ఇంటికి సాగనంపుదామని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. నూజెండ్ల మండలం ఐనవోలు గ్రామంలో చేపట్టిన ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి ’ కార్యక్రమంలో పాల్గొన్న జీవీ ఆంజనేయులు ముందుగా కార్యక్రమ వాల్పోస్టరును ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలపై అన్ని రకాల ధరల, పన్నుల భారాలను మోపిన వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, రాష్ట్రానికి ఇందే ఖర్మ అంటూ ఆందోళన చెందుతున్నారని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడటమే కాకుండా మహిళలకు భద్రత కరవైందన్నారు. రాబోవు కాలంలో టీడీపీ అధికారంలోకి రావాలని, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మీసాల మురళీకృష్ణయాదవ్, ముండ్రు సుబ్బారావు, వంకాయలపాటి పేరయ్య, మాజీ జడ్పీటీసీ ఆదెమ్మ తదితరులు పాల్గొన్నారు.