వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలో రేపు జరుగుతున్న జయహో బిసి సభలో పాల్గొనేందుకు ఉరవకొండ నియోజకవర్గం నుంచి పార్టీ శ్రేణులు తరలివెళ్లారు. నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు ఉరవకొండ పట్టణ, వివిధ మండలాల కన్వీనర్లు,రాష్ట్ర డైరెక్టర్లు, చైర్మన్లు, పార్టీ ప్రజాప్రతినిధుల ఆద్వర్యంలో వివిధ వాహనాల్లో సుమారు 1500 మంది విజయవాడ బీసీ సభకి వెళ్లారు. ముందుగా స్థానిక ప్రజాప్రతినిధులు జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా పలువురు బిసి నేతలు మాట్లాడుతూ.. బీసీలను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ముందుకు నడిపించేందుకు సీఎం కృషిచేస్తున్నారన్నారు. ప్రత్యేకంగా 56 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి, చైర్మన్, డైరెక్టర్ పదవులు ఇచ్చారన్నారు. అదే విధంగా నలుగురు బీసీలను రాజ్యసభకు పంపించారని వారు చెప్పారు. బీసీల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాటుపడుతున్నారని చెప్పారు. బీసీలను చంద్రబాబు కేవలం ఓటు బ్యాంక్‌గానే వాడుకున్నారని మండిపడ్డారు.