పాలకవర్గాల స్వప్రయోజనాల కోసం రాయలసీమలో ఏర్పాటు చేసుకున్న గర్జనలకు గాండ్రింపులకు జనం రాకపోతే సీమ ద్రోహులుగా రాష్ట్ర మంత్రులు అభివర్ణించడాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం శ్రీ సత్యసాయి జిల్లా సమితి అధ్యక్షులు అడపాల వేమనారాయణ మంగళవారం తీవ్రంగా ఖండించారు.
రాయలసీమలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా వేలాది మందికి ఉపాధి కల్పించే పరిశ్రమలను రానీయకుండా ఉన్నవాటిని తరిమేసే మిమ్మలని ఏ పేరుతో పిలవాలో డిక్షనరీలు వెతికినా కనపడదన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 34 వేల కోట్లతో 24 ప్రాజెక్టులకు హడావిడిగా శ్రీకారం చుట్టిన మీరు ఏ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయకపోగా రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు ముఖ ద్వారం అయినా కర్నూలు జిల్లాలో నది జలాల పరిష్కారాల వేదిక అయిన కృష్ణా బోర్డును ఏర్పాటు చేయాలన్న ఆకాంక్షను పక్కనపెట్టి విశాఖకు తరలించడాన్ని రైతు సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు
రాయలసీమ దుర్భిక్ష నివారణ పథకం కింద 23, 862 కోట్ల రూపాయలతో రాయలసీమ జిల్లాల్లోని కడప కర్నూలు అనంతపురం చిత్తూరు నెల్లూరు జిల్లాలోని 24 ప్రాజెక్టులకు ఒకేసారి టెండర్లు పిలిచి చేతులెత్తేసారని కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో కేవలం 1600 కోట్ల విలువైన పనులే చేసి బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆంద్రీనీవా సుజల స్రవంతి జీడిపల్లి రిజర్వాయర్ కేసి కెనాల్ ఏ ఒక్క ప్రాజెక్టు మూడు సంవత్సరాల కాలంలో పూర్తి చేయకుండా గర్జనలు గాండ్రింపు లంటూ పబ్బం గడుపుకుంటున్న ప్రజాప్రతినిధులను చూసి రాయలసీమ రైతాంగం కడుపు రగిలిపోతోందని ఇప్పటికైనా పాలకవర్గాలు కళ్ళు తెరిచి రాయలసీమ సాగునీటి తాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయకపోతే రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం నేర్పుతారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం హెచ్చరిస్తుందన్నారు.