బీసీలను దారుణంగా అణగదొక్కుతున్న ముఖ్యమంత్రి జగన్కు ప్రజలు బుద్ధిచెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. బీసీలకు జరుగుతున్న అన్యాయంపై టీడీపీ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయానికి చేరుకొని ఆర్డీవో రవీంద్రరావుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం సౌమ్య మాట్లాడుతూ, బీసీల అభ్యున్నతికి చంద్రబాబు ఆదరణ వంటి పథకాలు అమలు చేశారన్నారు. రాయితీపై రుణాలు ఇచ్చి బీసీలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దారన్నారు. విదేశీ విద్య కోసం కోట్లాది రూపాయలు వెచ్చించినట్లు చెప్పారు. సమాజంలో అత్యధికులైన బీసీలు వైసీపీ పాలనలో అన్ని విధాల వివక్షకు గురవుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో పెద్దయెత్తున బీసీ నాయకులు పాల్గొన్నారు.