అమరావతిలోని రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు జగన్ సర్కారు షాక్ ఇస్తోంది. రోజువారీ హాజరు విషయంలో కొందరు ఉద్యోగులు, అధికారులు సమయపాలన పాటించడం లేదని, పనివేళల్లో సచివాలయంలో ఉండటం లేదనే కారణాలతో కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఇక నుంచి ప్రతిశాఖలో ఓపీ సెక్షన్ ఇన్‌చార్జి (ఎంఎల్‌వో) రోజూ మధ్యాహ్నం 2 గంటలకు సిబ్బంది హాజరును క్లోజ్ చేసి, ఆ వివరాలను ఆయా శాఖల కార్యదర్శులకు పంపాలని ఆదేశించింది. ప్రతిరోజు ఉద్యోగుల హాజరు నిర్ధారణ బాధ్యత సంబంధిత శాఖ కార్యదర్శిపైనే ఉంటుందని స్పష్టం చేసింది. అలాగే ఉద్యోగుల హాజరుపై ఇక నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారని పేర్కొంది. ఈ ఆదేశాలను ప్రతి శాఖ కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది.