మాండస్ తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై తీవ్రంగా చూపుతోంది. దీంతో పాఠశాలలకు పలు జిల్లాలలో సెలవు ప్రకటించారు. ఏపీపై మాండూస్ తుఫాన్ ప్రభావం కనిపిస్తోంది. ప్రస్తుతానికి తీవ్ర తుఫాన్‌గా కొనసాగుతూ చెన్నైకు 320 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని ఐఎండీ తెలిపింది. అలాగే ఈ తుఫాన్ శుక్రవారం అర్ధరాత్రి నుండి శనివారం తెల్లవారు జాములోపు పుదుచ్చేరి- శ్రీహరికోట మధ్య మహాబలిపురం దగ్గర తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావంతో చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, అనంతపురం, సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు.
మాండూస్ తుఫాన్ ప్రభావం చిత్తూరు, తిరుపతి జిల్లాలపై కనిపిస్తోంది. తిరుపతిలో శుక్రవారం ఉదయం నాలుగు గంటలకు చలి గాలులతో కూడిన వర్షం కొనసాగుతోంది. దీంతో అధికారులు ముందుగా పాఠశాలకు సెలవు ప్రకటించారు. జిల్లా అధికారులు వర్షం ప్రభావంతో ఎక్కువగా ఉంటుంది అని.. అనవసరంగా రోడ్లపై ప్రజలెవరు తిరగొద్దని సూచించారు. దీంతో రోడ్లన్ని నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. తిరుమల దర్శనార్ధం వచ్చిన భక్తులు వర్షంతో ఇబ్బందిపడుతున్నారు. అంతేకాదు చిత్తూరు జిల్లాలో కూడా స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. మళ్లీ సమాచారం ఇచ్చే వారకు స్కూళ్లకు సెలవులు కొనసాగుతాయంటున్నారు. అంతేకాదు అధికారులకు సెలవులు రద్దు చేశారు.
మరోవైపు అధికారులు తుఫాన్ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. తుఫాన్ తీరం దాటే సమయంలో ఈదురు గాలులు బలంగా వీస్తాయంటున్నారు. స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి ఎప్పటికప్పుడు తుఫాన్ కదలికల రివ్యూ చేస్తున్నారు.. అలాగే తుఫాన్ ప్రభావిత జిల్లాల యంత్రాంగానికి సూచనలు చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నెల్లూరు-3, ప్రకాశం-2, తిరుపతి-2, చిత్తూరు-2 మొత్తం ఐదు ఎన్డీఆర్ఎఫ్, 4ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. వర్షాల సమయంలో ప్రజలు ఎవరు బయటకు రావొద్దంటున్నారు.