రానున్న కొన్నేళ్లలోనే భారత్‌లో చిప్ తయారీ యూనిట్‌ను ప్రారంభించబోతున్నట్లు టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ప్రకటించారు. సెమీకండక్టర్ల ఉత్పత్తి ప్రారంభిస్తామని, చిప్ సప్లై చెయిన్ సిస్టమ్‌లో అంతర్జాతీయంగా.. భారత్ కీలక పాత్ర పోషించగలదన్న లక్ష్యంతో టాటా గ్రూప్ ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు ఆయన అన్నారు.
గురువారం నిక్కీ ఏషియా ఇంటర్వ్యూలో ఆయన టాటా గ్రూప్ తదుపరి ప్రణాళికలు, భవిష్యత్తు లక్ష్యాలు సహా ఈ సెమీకండక్టర్ల ఉత్పత్తి గురించి మాట్లాడారు. ఇప్పటికే తాము ఏర్పాటుచేసిన టాటా ఎలక్ట్రానిక్స్ కింద.. సెమీకండక్టర్ అసెంబ్లీ టెస్టింగ్ వ్యాపారాన్ని నిర్వహించనున్నట్లు చంద్రశేఖరన్ వివరించారు. కొవిడ్-19 సమయంలో తీవ్రంగా ప్రభావితమైన చిప్ సరఫరా వ్యవస్థ.. ఇప్పటికీ కోలుకోలేకపోయిందని, ఆ అవాంతరాలను పూడ్చడానికే తాము ఈ రంగంలోకి ప్రవేశించాలని చూస్తున్నట్లు చెప్పారు.
విద్యుత్ వాహనాల వంటి వర్ధమాన రంగాల్లో కొత్త వ్యాపారాలను సృష్టించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు చంద్రశేఖరన్ స్పష్టం చేశారు. ఈ సందర్బంగానే 2020లో టాటా గ్రూప్ ప్రారంభించిన టాటా ఎలక్ట్రానిక్స్ ప్రస్తావన తీసుకొచ్చారు. దీని కిందే.. చిప్ అసెంబ్లీ టెస్టింగ్ బిజినెస్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. దీని కోసం పలు సంస్థలతో చర్చలు జరుపుతున్నామని, ఇప్పటికే ఉన్న చిప్ తయారీ సంస్థలతో కూడా పార్ట్‌నర్‌షిప్‌కు అవకాశం ఉంటుందని అన్నారు. ఏమాత్రం అనుభవం లేని కంపెనీ సొంతంగా చిప్ తయారీ బిజినెస్‌లోకి ప్రవేశించడం పెద్ద సవాల్ అని వ్యాఖ్యానించారు.
ఈ ఆగస్టులోనే చంద్రశేఖరన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలక్ట్రానిక్స్ మానుఫ్యాక్చరింగ్, 5G నెట్‌వర్క్ ఎక్విప్‌మెంట్, సెమీకండక్టర్ల రంగంలోకి ప్రవేశించేందుకు టాటా గ్రూప్ ప్లాన్ చేస్తున్నట్లు అప్పుడే చెప్పారు. ప్రస్తుతం ప్రపంచ సరఫరా గొలుసు.. ఎక్కువగా చైనాపై ఆధారపడి ఉందని, అయితే.. ఇది ఇతర దేశాలకు మళ్లిస్తే పోస్ట్ పాండిమిక్ తర్వాత పెద్ద మార్పు కనిపిస్తుందని అన్నారు.
కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన తర్వాత టాటా గ్రూప్ కొత్త కొత్త వ్యాపారాల్లోకి ప్రవేశిస్తోంది. 5G సర్వీసెస్ కోసం టెలికాం పరికరాల సంస్థ తేజస్ నెట్‌వర్క్స్‌లో వాటా దక్కించుకుంది. మరోవైపు సూపర్ యాప్ కోసం బిగ్‌బాస్కెట్, 1MG, క్యూర్‌ఫిట్ వంటి సంస్థలనూ టాటా డిజిటల్ కొనుగోలు చేసింది.