కొన్ని మార్పులు...చేర్పులతో మళ్లీ రోడ్డుపైకి నానో కార్లు రాబోతున్నాయన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. టాటా నానో కారు కేవలం రూ.లక్ష కనీస ధరతో విడుదల చేసింది టాటా గ్రూప్. టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్, దిగ్గజ పారిశ్రామిక వేత్త రతన్ టాటా కలల కారు కూడా ఇదే. మోటార్ సైకిల్ కొనుక్కునే ధరలోనే కారును లాంఛ్ చేసి సంచలనం సృష్టించింది టాటా మోటార్స్. అయితే మొదట్లో డిమాండ్ ఉన్నా క్రమక్రమంగా మనుగడ కోల్పోయింది. ముడిభాగాల ధరలు పెరగడంతో కొన్నేళ్లకు రేట్లను కూడా పెంచింది. సేల్స్ తగ్గిపోవడంతో ఇది ఫెయిల్డ్ ప్రాజెక్ట్‌గా నిలిచింది. దీంతో 2019 నుంచి తయారీని కూడా నిలిపివేసింది టాటా మోటార్స్.
అయితే మళ్లీ ఇన్నేళ్లకు టాటా నానో గురించి మళ్లీ వార్తలు వినిపిస్తున్నాయి. టాటా నానో మళ్లీ వచ్చేస్తుందని పలు మీడియాల్లో రిపోర్ట్స్ వస్తున్నాయి. అయితే ఈ సారి సరికొత్త అవతారంలో టాటా నానో మార్కెట్లోకి వచ్చేందుకు ప్లాన్ చేస్తుందని తెలుస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల వాడకం ఎక్కువై, మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో నానోను ఈసారి ఎలక్ట్రిక్ వెర్షన్‌లో తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది టాటా గ్రూప్. కొన్ని మార్పులు చేర్పులు చేసి ఎలక్ట్రిక్ వెర్షన్‌లో టాటా నానో కారును తీసుకొచ్చేందుకు టాటా మోటార్స్ యోచిస్తోందని టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా పేర్కొంది. ఇప్పుడు సరికొత్త లుక్‌లో గణనీయమైన మార్పులు చేసి తీసుకురానుందని సమాచారం.
టాటా మోటార్స్ ఇప్పటికే కర్వ్, అవిన్యా వంటి కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ కార్లను ప్రదర్శించింది కూడా. వచ్చే ఐదేళ్లలో టాటా మోటార్స్.. 10 ఎలక్ట్రిక్ మోడల్ కార్లను విడుదల చేయాలని చూస్తోందట. ఇందులో టాటా నానో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి కొన్ని ఫీచర్లు కూడా లీకయ్యాయి. ఈ కార్ టాప్ స్పీడ్ గంటకు 110 కిలోమీటర్లుగా ఉంది. 23 HP పవర్, 85 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుందంట. 10 సెకన్లలోనే 0 నుంచి 60 కిలోమీటర్ల వేగం అందుకుంటుందంట. సింగిల్ ఛార్జ్‌తో 160- 200 కిలోమీటర్ల దూరం ప్రయాణించొచ్చు. 72v లిథియం- అయాన్ బ్యాటరీతో రానున్నట్లు అంచనా వేస్తున్నారు. దీని కనీస ధర కూడా రూ.2-3 లక్షల మధ్య ఉండొచ్చని వార్తలొస్తున్నాయి. మరో విషయం ఏంటంటే.. టాటా మోటార్స్‌కు చెందిన టాటా నెక్సాన్ EV (Tata Nexon EV) కారుకు దేశంలో మంచి డిమాండ్ ఉంది. ఇది భారత్‌లో బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ కార్‌గా కూడా ఘనత సాధించింది. ఇప్పటివరకు దీని సేల్స్ 35 వేల యూనిట్లు దాటింది. చాలా కుటుంబాలు తమ పిల్లలతో స్కూటర్లపై వెళ్లడాన్ని చూసి, పిల్లలు నలిగిపోతున్నారన్న భావనతో.. నానో కార్లను విడుదల చేయాలన్న స్ఫూర్తి రతన్ టాటాలో కలిగింది. దీన్ని గతంలో ఒకసారి తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో వెల్లడించారు టాటా. దీనిపై దిగ్గజ పారిశ్రామిక వేత్తలు ప్రశంసలు కురిపించారు. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కూడా టాటా నిర్ణయాన్ని ప్రశంసించారు.