ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజా రంజక పాలనపై ప్రజలు చూపుతున్న ఆదరణతో, నమ్మకంతో రాష్ట్రంలో 175 స్థానాలు గెలిచి తీరుతామని ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగిందని, దానిని నిజం చేయాల్సిన బాధ్యత పార్టీ నాయకులు, పార్టీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలందరి పైన ఉందని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. శనివారం సాయంత్రం కమ్మ వీధిలో 9, 11, 15, 16, 18 డివిజన్లకు సంబంధించి జోనల్ ఇన్చార్జిలు మరియు కార్పొరేటర్లు గుజ్జల నారాయణరావు, అల్లు చాణక్య ల అధ్యక్షతన జరిగిన సమావేశంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల ముఖ్యఅతిథిగా పాల్గొని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడపగడపకు కార్యక్రమానికి ముందే విజయనగరం నియోజకవర్గంలో శత శంకుస్థాపనలు, ద్విశత శంకుస్థాపన పేరిట ప్రజల్లోకి వెళ్లి ప్రజలకు మౌలిక వసతులు కల్పించడం జరిగిందన్నారు. పనులు పూర్తయిన తర్వాత జరిగిన నగరపాలక ఎన్నికలలో ప్రజలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని, ప్రజలందరూ మన వెంటే ఉన్నారని అన్నారు. ప్రజలకు జవాబుదారీగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉందని అన్నారు.
అమలు చేయలేని హామీలతో ఎన్నికలకు వెళ్లిన చంద్రబాబుని, ప్రజలు చీకొట్టిన సంగతి మీకు తెలిసిందే అని అన్నారు. ప్రజల దగ్గరకు వెళ్లి ఓట్లు అడిగే అర్హత చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీ నేతలకు లేదని అన్నారు. తెలుగుదేశం పార్టీ చేపట్టిన బాదుడే బాదుడు, ఇదేం కర్మ రా కార్యక్రమాలకు పార్టీ ఆదేశాలతో మొక్కుబడిగా అశోక్ ప్రజల్లోకి వెళుతున్నారని అన్నారు. ప్రజల కష్టాలను తీర్చగలిగిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. కరోనా సమయంలో ప్రజలు భయపడుతూ ఉంటే , ప్రజల నుంచి ఓట్లు అడిగిన రాజకీయ నాయకులు బంగ్లాకు తాళం వేసుకొని, ఎవరు రాకండి అని అశోక్ గజపతి రాజు బంగ్లాలో కూర్చుంటే, ప్రజలకు ధైర్యం ఇవ్వాలి, భరోసాగా ఉండాలనే ఉద్దేశంతో , వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజలకు అండగా ఉన్న విషయాన్ని అందరికీ తెలుసు అని అన్నారు. తన 38 ఏళ్ల రాజకీయ జీవితంలో నిత్యం ప్రజలతో మమేకమై ఉన్నానని అన్నారు. తన నివాసానికి రాత్రి సమయాల్లో తప్ప గేట్లు ఎప్పుడూ తెరిచే ఉంటాయని అన్నారు. పార్టీ అనుబంధ కమిటీలకు సంబంధించి దిశ నిర్దేశం చేశారు. సంబంధిత పుస్తకాలను అందజేశారు. అధికారం, రాజకీయం రెండు సమాంతరంగా పనిచేసిన నాడు ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ వెంపటాపు విజయలక్ష్మి, కార్పొరేటర్లు సయ్యద్ గౌస్, యవర్న విజయలక్ష్మి, పార్టీ నాయకులు లంక వరలక్ష్మి, మీసాల మధు, ఆయా డివిజన్లకు సంబంధించి పార్టీ అధ్యక్షులు, నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.