జమ్మూకశ్మీర్ లో రెచ్చిపోతున్న ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపేందుకు అధికార్లు సిద్దమయ్యారు. ఈ క్రమంలోనే జమ్మూకశ్మీర్‌లో బుల్డోజర్ కవాతు మొదలైంది. కశ్మీర్‌లో పుల్వామా ఘటన నిందితుడి ఇంటిని నాశనం చేశారు. ఉగ్రవాద సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటున్న కేంద్రం శనివారం ఈ కూల్చివేతకు పాల్పడింది. అయితే ఈ ఇంట్లో ఉండే ఉగ్రవాది పీవోకేకు పారిపోయాడు. ఆ ఇంట్లో ప్రస్తుతం ఎవరూ ఉండడం లేదు.
పుల్వామా జిల్లాలోని రాజౌరీలో పాకిస్థాన్ జైషే మహమ్మద్‌కు చెందిన ఉగ్రవాది ఆషిక్ నెన్‌గ్రూ ఇంటిని ప్రభుత్వం బుల్డోజర్‌తో ధ్వంసం చేసింది. ఆషిక్ నెన్‌గ్రూ పుల్వామా ఘటనలో నిందితుడిగా ఉన్నాడు. గతంలో ఓ టన్నెల్ ద్వారా పాకిస్థాన్‌కు పారిపోయిన ఆషిక్... పీవోకేలో ఉంటూ భారత భూభాగంపై ఉగ్రదాడులకు ప్లాన్ చేస్తున్నాడు. స్థలాన్ని అక్రమంగా ఆక్రమించి ఇంటిని కట్టుకున్నట్టు అధికారులు తెలియజేశారు.
పుల్వామా ఘటనలోనే కాకుండా అనేక ఉగ్ర దాడుల్లో ఆషిక్ పాల్గొన్నట్టు కేంద్ర ప్రభుత్వం విచారణ సంస్థలు చెబుతున్నాయి. భారత ప్రభుత్వం జారీ చేసిన ఉగ్రవాద జాబితాలో నెన్‌గ్రూ పేరును కూడా చేర్చారు. ఆషిక్ ఇల్లు కూల్చివేత చర్యతో టెర్రరిస్టులు, వారికి సహాయపడేవారికి ప్రభుత్వం స్పష్టమైన సందేశాన్ని ఇవ్వాలని భావించింది. ఉగ్రవాద చర్యలకు ఎవరు పాల్పడినా, సాయపడినా ఇలాంటి కఠినమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చినట్టైంది.