నిరసన ర్యాలీతో బంగ్లాదేశ్ ఉలిక్కిపడింది. ఇదిలావుంటే బంగ్లాదేశ్ జాతీయ ఎన్నికలు వచ్చే సంవత్సరం జరగనున్నాయి. ఈ క్రమంలో అక్కడి ప్రతిపక్షాలు అధికార పార్టీపై విరుచుకుపడుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలపై మండిపడుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం రాజధాని ఢాకాలో ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో విపక్షాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. 14 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న బీఎన్‌పీ.. ఈసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలనే తపనతో ఉంది.
ఈ మేరకు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున కార్యకర్తలను, సానుభూతిపరులను కూడగట్టి ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించింది. ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపడుతుంది. ఇందులో భాగంగానే వారం రోజుల క్రితం ఇదే పార్టీ ర్యాలీ చేపట్టింది. అయితే ఆ నిరసన హింసాత్మకంగా మారింది. ఆ సమయంలో పోలీసులకు, బీఎన్‌పీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవలో ఓ వ్యక్తి మృతి చెందాడు.
దీంతో బీఎన్‌పీ జనరల్ సెక్రటరీ మిర్జా ఫఖ్రుల్ సహా వెయ్యి మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. హింసాత్మక చర్యలకు పాల్పడ్డారంటూ కేసులు పెట్టి జైలుకు పంపించారు. అనంతరం డిసెంబర్ 10న నిరసనపై ఆంక్షలు విధించారు. అయినప్పటికీ తమ ర్యాలీ ఆగదని పోలీసులు అరెస్ట్ చేసిన అనంతరం మిర్జా ఫఖ్రూల్ పేర్కొన్నారు.
అన్నట్టుగానే శనివారం రాజధానిలో పార్టీ కార్యకర్తలు... మద్దతుదారులతో పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని అదుపు చేయడానికి ప్రభుత్వం 30 వేల మంది రాపిడ్ యాక్షన్ ఫోర్స్, నాలుగు వేల మంది పారా మిలట్రీ ఫోర్స్‌ని దింపింది. కాగా ఈ ర్యాలీకి ముందే మిగిలిన విపక్షాలతో కలసి ప్రభుత్వం ముందు డిమాండ్లను పెట్టినట్టు బీఎన్‌పీ పేర్కొంది. అందులో డిజిటల్ భద్రతా చట్టాన్ని వెనక్కి తీసుకోవడం, విద్యుత్, ఇంధనం, ఇతర నిత్యావసర వస్తువుల ధరల తగ్గింపు, అవినీతిని నిరోధించడానికి కమిషన్ ఏర్పాటు, అదృశ్యాలు, హత్యలు, మతపరమైన నేరాల బాధితులపై విచారణ వంటి డిమాండ్లు ఉన్నాయి.