ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం తారాస్థాయికి చేరిందని, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు చెల్లించలేని పరిస్థితిలో ఉందని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు విశ్వనాథ్ నాయక్ తెలిపారు. ఆదివారం సుండుపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకటవ తేదీ ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన నెల వారి జీతం11వ తేదీ వచ్చినా చెల్లించకపోవడం ఇది ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పైన కక్ష సాధింపేనని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ఖజానాను తన రాజకీయ లబ్ధి కోసం మరో మారు అధికారంలోకి వచ్చేందుకు సంక్షేమ పథకాల పేరుతో నిధులను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో ఎక్కడ కూడా అభివృద్ధి జరగడం లేదని అన్నారు.
రాష్ట్రంలో వస్తున్న ఆదాయం పైన ఖర్చు చేసిన విధులపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు మూడు నుంచి 6 నెలల వేతనాలు చెల్లించాలని పంచాయతీలో విద్యుత్ బిల్లులు కూడా చెల్లించలేని దుస్థితిలో ఉన్నారని ఇప్పటివరకు ఏ గ్రామపంచాయతీలో కూడా 14వ ఆర్థిక సంఘం 15వ ఆర్థిక సంఘం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు పూర్తిగా అనవసరమైన పథకాల కోసం నిధులు మళ్లించి గ్రామ పంచాయతీ అభివృద్ధిని ఆటంకం కలిగించడంతోపాటు పంచాయతీ సర్పంచులను దిష్టిబొమ్మలాగా తయారు చేశారని ఎద్దేవా చేశారు.
ఇప్పటివరకు జీతాలు పడకపోవడంతో విశ్రాంత ఉద్యోగులందరూ కూడా బిక్కుబిక్కుమంటున్నారని రాష్ట్రం ఆర్థిక సంక్షోభంతో అస్తవ్యస్తమవుతుందని ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడమే దీనికి కారణం అన్నారు. ఇప్పటికైనా ఆర్థిక శాఖ అధికారులతో సమన్వయం చేసి ఎక్కడ పొరపాటు జరుగుతుందో సవరించుకోవాలని లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి పెద్ద గుణపాఠమే చెబుతారని హెచ్చరించారు.