రాష్ట్రంలోని యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలే లక్ష్యంగా ఉన్నత విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకువస్తున్నామని, ఈ మార్పులు రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె. హేమచంద్రారెడ్డి అన్నారు. శనివారం ఆయన డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు.
వర్సిటీలో ఆధునీకరించిన లైబ్రరీని ప్రారంభించారు. కొత్తగా నిర్మించిన బాలుర వసతి గృహాన్ని, నిర్మాణంలో వున్న పరిపాలనా భవనం పనులను ఆయన పరిశీలించారు. అనంతరం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ హాలులో వైస్చాన్సలర్ ప్రొఫెసర్ నిమ్మ వెంకటరావు ఆయనను సన్మానించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కె. హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్మోహన రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారన్నారు. విద్యార్థుల అభివృద్ధే లక్ష్యంగా ఉన్నత విద్యారంగ సంస్థలన్నీ పనిచేయాలని, ఉన్నత చదువులను అందించడంతో పాటు దేశ, విదేశాల్లో ఉన్నతమైన ఉద్యోగ అవకాశాలు పొందేలా విద్యార్థులను తీర్చిదిద్దాలనేది ఆయన లక్ష్యమని అన్నారు.
ముఖ్యమంత్రి సంకల్పించిన అభివృద్ధి బాటలో వర్సిటీలు, ఇతర ఉన్నత విద్యాసంస్థలు పనిచేసి రాష్ట్ర పురోభివృద్ధి సహకరించాలన్నారు. డిగ్రీ విద్యార్థులకు ఇంటర్నెషిప్ ప్రొగ్రామ్, సామాజిక సేవా కార్యక్రమాల్లో విద్యార్థులను భాగస్వామ్యం చేయడం, కమ్యూనికేషన్ స్కిల్స్లో శిక్షణ, విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలపట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తోందన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ ఫలితాలు ఇస్తున్నారని అన్నారు. గతంలో 37 వేలు వున్న ప్లేస్మెంట్స్ను ఈ ప్రభుత్వం 87 వేలుకు పెంచిందన్నారు. ఉన్నత విద్యను అభ్యసించేవారి సంఖ్యతో పోలిస్తే ఇది తక్కువయినప్పటికీ ప్రభుత్వ కృషి ఫలితాలు ఇస్తున్నాయనడానికి నిదర్శనమన్నారు. ప్రభుత్వ లక్ష్యాలు సాకారం అయ్యేందుకు విశ్వవిద్యాలయాలు, అధ్యాపకులు, సిబ్బంది నిబద్ధతతో, సమిష్టిగా కృషి చేయాలని ప్రొఫెసర్ కె. హేమచంద్రా రెడ్డి అన్నారు.