మూడున్నరేళ్లలో బీసీలకు ఈ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కళా వెంకటరావు డిమాండ్ చేశారు. విజయనగరం తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీలకు ఎన్నో వరాలు కురిపించారని, వాటిని నెరవేర్చకపోగా పనికిరాని కార్పొరేషన్లు ఏర్పాటు చేశారన్నారు. వాటికి చైర్మన్లు, డైరెక్టర్లు మాత్రమే ఉన్నారని, కార్యాలయం కాని.. కూర్చొనేందుకు కుర్చీ కానీ లేదన్నారు. అధికారాలు, విధులు లేని బీసీ కార్పొరేషన్ల వల్ల ఇసుమంతైనా ప్రయోజనం కలగలేదని, ఇప్పటివరకు ఎంత మంది బీసీ విద్యార్థులను విదేశీ విద్యకు పంపించారో రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని కోరారు.