అవినీతికి తావులేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలను వాలంటీర్లు డోర్ డెలివరీ చేసుతన్నారని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. వాలంటీర్ల వ్యవస్థతో నేరుగా లబ్ధిదారుల ఇంటికే సంక్షేమం అందుతుందన్నారు. వాలంటీర్ వ్యవస్థ మీద దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సోమవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో నవరత్నాలు బాగా అమలవుతున్నాయని, ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ గారికి మంచిపేరు వస్తుందని ఇలాంటి విషపు రాతలు రాస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థను మేం పార్టీ ప్రయోజనాలకు వాడుకోవాల్సిన అవసరం ఏముంది...? గత పదేళ్లలో క్షేత్ర స్థాయిలో మా పార్టీ బలోపేతంగా ఉంది. మా నాయకుడు వైయస్ జగన్ పార్టీని అలా తీర్చిదిద్దారు. ప్రతి బూత్ స్థాయి నుంచి గ్రామ, మండల స్థాయి వరకూ మాకు శాస్త్రీయంగా ప్రతినిధులు ఉన్నారు. దానికి నిదర్శనమే మొన్నటి ఎన్నికల ఫలితాలు. పార్టీ బలోపేతానికి ఎప్పటికప్పుడు మా నాయకుడు వైయస్ జగన్ దిశానిర్ధేశం చేస్తున్నారు.