మాండూస్ తుఫాను ధాటికి ఏపీలోని రెండు జిల్లాలు గజగజవణుకుతున్నాయి. ఇదిలావుంటే మాండూస్ తుపాను తీరం దాటి క్రమేణా బలహీనపడి అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో ఏపీ దక్షిణ కోస్తాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నాయుడుపేట, సూళ్లూరుపేట డివిజన్లలోనూ, వెంకటగిరి, వెలుగొండ అటవీప్రాంతంలోనూ గత మూడ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. 254 చెరువులకు గాను 60 చెరువుల్లో నీటిమట్టం ప్రమాదకర స్థితికి చేరింది. మిగతా చెరువుల్లో 50 శాతానికి పైగా నీరు చేరుతోంది. గూడూరు వద్ద పంబలేరు వాగు, సన్నకాలువలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. గూడూరు డివిజన్ లోని చిలుకూరు మండలంలో వాగులు, వంకలు ఉప్పొంగడంతో రోడ్లపై నీరు ప్రవహిస్తోంది. అటు, నెల్లూరు జిల్లాలో సోమశిల ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దాంతో అధికారులు 38 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.