చిత్తుగా మద్యం తాగిన ఓ యువకుడు కందూరు నదిని దాటే యత్నంలో కొట్టుకు పోతుండగా, అక్కడే ఉన్న గ్రామస్తులు అతడిని ఒడ్డుకు చేర్చారు. ఈ ఘటన సోమవారం సాయంత్రం, చిత్తూరు జిల్లా సోమల మండలంలో చోటుచేసుకుంది. కందూరు- కలికిరి మార్గ మధ్యంలోని కందూరు హైస్కూల్ వద్ద ప్రవహిస్తు నదిపై నిర్మించిన తాత్కాలిక కల్వర్టు రెండు రోజుల కిత్రం భారీ వర్షంతో కొట్టుకు పోయింది. ఈమార్గంలో బస్సుల రాకపోకలు ఆగిపోయాయి. ఈ క్రమంలో నదిలో ప్రవాహవేగం ఉండగానే కొందరు కందూరుకు వచ్చి తిరిగి గ్రామాలకు చేరుకోవడానికి నది ప్రవాహాన్ని దాటుతున్నారు. ఇలా సోమవారం సాయంత్రం కందూరులో మద్యం తాగిన ఓ యువకుడు నదిని దాటుతున్నాడు. మద్యం మత్తులో అదుపు తప్పి నదిలో కొంతదూరం కొట్టుకు పోయాడు. ఈ క్రమంలో సిమెంటు పైపును పట్టుకొని నిలబడగా.. గ్రామస్తులు అతడిని పట్టుకుని ఒడ్డుకు చేర్చారు.