మనకు భూమి మీద నూకలున్నంత కాలం చావు దారికి చేరదన్నది మరోసారి రుజువైంది. ఓ ఘోర ప్రమాదం నుంచి ఓ యువకుడు అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. లారీ, బైకు ఎదురెదురుగా వస్తుండగా.. లారీకి ఉన్న తాడు బైక్ మీద వెళుతోన్న యువకుడి మెడకు చుట్టుకుంది. దీంతో యువకుడు బైక్ మీద నుంచి ఎగిరి రోడ్డుపై పడ్డాడు. తాడు మరింత బిగుసుకోకపోవడం, అక్కడున్నవారు తక్షణమే స్పందించడం వల్ల బాధితుడు స్వల్పగాయాలతో త్రుటిలో తప్పించుకున్నాడు. తమిళనాడులోని తూత్తుకూడిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతడికి భూమ్మీద నూకలున్నాయి కాబట్టే పెను ప్రమాదం నుంచి బయటపడ్డాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
తూత్తుకూడి జిల్లా శ్రీవైకుంఠం పట్టణానికి చెందిన ముత్తు అనే యువకుడు ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. ఏరల్ ప్రాంతం వద్దకు చేరుకునేసరికి ఎదురుగా ఎరువుల బస్తాలు లోడ్‌తో ఓ లారీ వస్తోంది. ముత్తు కంటే ముందు ఓ బైకర్ ఆ వాహనాన్ని దాటుకుని వెళ్లిపోగా... ముత్తు కూడా దాని పక్క నుంచి వెళ్తున్నాడు. ఊహించని విధంగా లారీలో నుంచి ఎరువుల బస్తా జారిపడి.. దానికి ఉన్న తాడు ముత్తు మెడకు చుట్టుకుంది. దీంతో ఒక్కసారిగా ముత్తు బైకు పై నుంచి అమాంతం గాలిలోకి ఎగురుతూ రోడ్డుపై పడిపోయాడు.
బైక్‌పై నుంచి కింద పడిపోవడంతో అతడి మెడకు తాడు మరింతగా చుట్టుకోలేదు. చుట్టుపక్కల ఉన్నవారంతా తక్షణమే స్పందించి ముత్తును పైకి లేపి ఆస్పత్రికి తరలించారు. దీంతో స్వల్పగాయాలతో యువకుడు బయటపడ్డాడు. కొంచెం అటూఇటూ అయినా లారీకి వెళాడుతున్న తాడే.. ముత్తుకు ఉరితాడయ్యేది. ఘటన జరిగిన తర్వాత ముత్తు స్పృహకోల్పోయాడు. ఆ షాక్ నుంచి తేరుకుని ఏం జరిగిందో తెలుసుకునేందుకు అతడికి రెండు నిమిషాలు పట్టింది. స్థానికులు లారీ డ్రైవర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. వీడియో బయటకు రావడంతో వైరల్ అవుతోంది.