ఢిల్లీలో జరిగిన శ్రద్దా వాకర్ కేసులో డీఎన్‌ఏ పరీక్షలు పూర్తయ్యాయి. ప్రియుడు అఫ్తాబ్ పూనావాలా చేతిలో దారుణ హత్యకు గురైన శ్రద్ధా వాకర్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. మొహ్రౌలీ అటవీ ప్రాంతంలో లభ్యమైన ఎముకలు.. శ్రద్ధా వాకర్ తండ్రి నుంచి సేకరించిన నమూనాలు డీఎన్‌ఏ పరీక్షల్లో సరిపోలినట్టు పోలీస్ వర్గాలు తెలిపాయి. శ్రద్ధా వాకర్ మృతదేహాన్ని 35 ముక్కలుగా కోసి, ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో నిందితుడు అఫ్తాబ్ పూనావాలా విసిరేసిన విషయం తెలిసిందే. ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత నిందితుడు వెల్లడించిన వివరాల ఆధారంగా.. శ్రద్ధా శరీర భాగాల కోసం పోలీసులు గాలించారు. మొహ్రౌలీ అటవీ ప్రాంతంలో దవడ భాగాలు సహా 13 ఎముకలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
‘‘మొహ్రౌలీ అటవీ ప్రాంతంలో స్వాధీనం చేసుకున్న ఎముకలకు సంబంధించిన డీఎన్ఏ నివేదిక పోలీసులకు అందింది.. శ్రద్ధా వాకర్ తండ్రి వికాస్ వాకర్ నుంచి సేకరించి డీఎన్ఏ నమూనాలతో ఇవి సరిపోలాయి’’ అని పోలీస్ వర్గాలు తెలిపాయి. డీఎన్ఏ విశ్లేషణ కోసం ఎముకల నమూనాలను సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపారు. మరోవైపు, నిందితుడు అఫ్తాబ్ పూనావాలకు నిర్వహించిన పాలీగ్రాఫ్ టెస్ట్ నివేదికను పోలీసులకు ఫోరెన్సిక్ సైన్సెస్ ల్యాబ్ బుధవారం అందజేసింది.
ఢిల్లీ శాంతి భద్రతల విభాగం ప్రత్యేక కమిషనర్ సాగర్ ప్రీత్ హుడా మాట్లాడుతూ.. డీఎన్ఏ, పాలిగ్రాఫ్ పరీక్షల నివేదికలు పోలీసులకు అందాయని తెలిపారు. పోలీసుల తదుపరి దర్యాప్తునకు ఇవి సహకరిస్తాయని, స్వాధీనం చేసుకున్న మృతదేహంలోని మిగతావాటిని పోస్ట్‌మార్టమ్ కోసం పంపున్నామని అన్నారు. విచారణ కోనసాగుతోందని కమిషనర్ పేర్కొన్నారు.
కేసు దర్యాప్తులో భాగంగా ఛతార్‌పూర్‌లోని నిందితుడు అఫ్తాన్ పూనావాలా నివాసానికి గురువారం వెళ్లారు. మే 18న శ్రద్ధా వాకర్‌ను హత్యచేసిన పూనావాలా ఆనవాళ్లు దొరక్కుండా ఉండేందుకు మృతదేహాన్ని ముక్కలుగా కోసి కొన్నాళ్లు తన ఇంటిలోని ఫ్రిజ్‌లో భద్రపరిచాడు. రోజుకు కొన్ని చొప్పున రాత్రిపూట వాటిని తీసుకెళ్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో విసిరేసినట్టు విచారణలో వెల్లడించాడు. తూర్పు ఢిల్లీలోని మొహ్రౌలీ అటవీ ప్రాంతంతో పాటు మదన్‌గిర్‌లోని ఓ చెరులోనూ పడేశాడు.
ఇదిలావుంటే ఇటీవల మీడియా ముందుకొచ్చిన శ్రద్ధా వాకర్ తండ్రి వికాస్.. తన కుమార్తెను చంపినవాడ్ని అదే మాదిరిగా ఉరి తీయాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్ర పోలీసులు సమయానికి స్పందించి ఉంటే తన కుమార్తె బతికేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఢిల్లీ పోలీసుల దర్యాప్తుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేస్తూ.. సరైన దిశగానే సాగుతోందన్నారు. అఫ్తాబ్‌ను ఉరితీయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.