ఆన్‌లైన్ ఆహార డెలివరీ సంస్థలు స్విగ్గీ, జొమాటోలకు నానాటికీ ఆదరణ పెరుగుతోంది. దేశంలో లక్షలాది మంది వినియోగదారుల ఆకలి తీర్చేందుకు ఇవి చిరునామాగా మారాయి. ఆన్‌లైన్‌లో ఫుడ్ డెలివరీ చేసుకుంటున్న వారు ఎక్కువగా ఆర్డర్ చేస్తున్న ఐటెమ్ ఏంటి? ఈ ప్రశ్నకు మరో ఆలోచన లేకుండా ‘బిర్యానీ’అని సమాధానం చెప్పొచ్చు. ఆ ఆన్సర్ అందరూ ఊహించిందే అయినా.. స్విగ్గీ గణాంకాలు మాత్రం ఆశ్చర్యపరుస్తున్నాయి. హైదరాబాదీల ఇష్టమైన వంటకం ‘బిర్యానీ’ని భారతీయులు ఏం రేంజ్‌లో తింటున్నారో తెలుసా..? స్విగ్గీలో సెకన్‌కు 2.28 బిర్యానీలను ఆర్డర్ చేస్తున్నారు. 2022లో ఈ స్థాయి బిర్యానీ ఆర్డర్‌లతో స్విగ్గీ సరికొత్త రికార్డు నెలకొల్పింది. స్విగ్గీ సంస్థ ఈ ఏడాది ఆర్డర్లకు సంబంధించి విడుదల చేసిన గణాంకాల్లో ఆసక్తికర వివరాలు ఉన్నాయి.
బెంగుళూరుకు చెందిన ఓ కస్టమర్ అత్యధిక విలువైన ఆర్డర్ చేసిన వ్యక్తిగా నిలిచారు. దీపావళి పండుగ సందర్భంగా ఆయన ఏకంగా రూ. 75,378 విలువైన ఆర్డర్ చేశారు. ఆ తర్వాత పూణేకు చెందిన మరో కస్టమర్ ఒకేసారి తన టీమ్ మొత్తానికి రూ. 71,229 బిల్లు విలువతో బర్గర్లు, ఫ్రైస్‌లను ఆర్డర్ చేసి రెండో స్థానంలో నిలిచారు.
ఈ ఏడాది దేశవ్యాప్తంగా లక్షకు పైగా రెస్టారెంట్లు, క్లౌడ్ కిచెన్‌లు స్విగ్గిలో కొత్తగా చేరాయి. ఫుడ్ లవర్స్ ఏ స్థాయిలో పెరిగారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. దేశ ఆర్థిక రాజధాని ముంబై, దేశ రాజధాని ఢిల్లీ నగరాలు ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీల్లో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి (స్వి్గ్గీ గణాంకాల ప్రకారం). ‘స్విగ్గీ వన్’ ఆఫర్‌తో అత్యధికంగా ఆదా చేసిన అగ్ర నగరంగా బెంగళూరు నిలిచింది. ఈ నగరానికి చెందిన కస్టమర్లు ఏకంగా రూ. 100 కోట్లకు పైగా ఆదా చేశారని స్విగ్గీ తెలిపింది. ముంబై, హైదరాబాద్, ఢిల్లీ వాసులు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఢిల్లీకి చెందిన ‘స్విగ్గీ వన్’ కస్టమర్ అత్యధికంగా రూ.2.48 లక్షలను ఆదా చేశారని ఆ సంస్థ తెలిపింది. ‘స్విగ్గీ వన్’ అనేది ఉచిత డెలివరీలు, ఆకర్షణీయమైన ధరలు, ఇతర ఆఫర్లను అందించే మెంబర్‌షిప్ ప్రోగ్రామ్.
స్విగ్గీ డెలివరీ ఏజెంట్స్‌కు టిప్స్ రూపంలో ఎంత మొత్తం వచ్చిందో తెలిస్తే నోరెళ్లబెడతారు. ఈ సంవత్సరం కస్టమర్లు తమ డెలివరీ ఏజెంట్లకు రూ.53 కోట్ల రూపాయలను టిప్ రూపంలో ఇచ్చారని స్విగ్గీ తెలిపింది. మొత్తం 35 లక్షల మంది కస్టమర్లు టిప్ ఇచ్చారని వెల్లడించింది. ఈ మొత్తం 100 శాతం తమ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లకు అందిందని ఆ సంస్థ తెలిపింది. టిప్స్ రూపంలోనే ఇన్ని కోట్ల రూపాయలు వచ్చాయంటే.. ఇక బిజినెస్ ఏ స్థాయిలో జరుగుతుందో ఊహించుకోవచ్చు. ఒక్క స్విగ్గీలోనే ఈ స్థాయిలో వ్యాపారం జరిగితే.. జోమాటో, ఇతర సంస్థల ద్వారా ఎంత వ్యాపారం జరుగుతుందో.