ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంచుకున్న లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా ప్రతి నాయకుడు కార్యకర్త కృషి చేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కార్యకర్తలకు, నాయకులకు దిశా నిర్దేశం చేశారు. గురువారం మడకశిర పట్టణంలోని యాదవ కళ్యాణ మండపంలో మడకశిర నియోజకవర్గస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. వైసిపి జిల్లా అధ్యక్షుడు శంకర్ నారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ 2024లో జరిగే ఎన్నికల్లో విజయమే ధ్యేయంగా పనిచేయాలన్నారు. దేశంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా అమలు చేయని సంక్షేమ పథకాలు 98. 4శాతం అమలు చేసి అన్ని రాష్ట్రాలకు మార్గదర్శంగా జగన్ నిలిచాడన్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ లోటుపాట్లు ఉంటాయని వాటిని ప్రత్యేకంగా చూపించి పార్టీని దెబ్బతీయడానికి ప్రయత్నించరాదని హెచ్చరించారు. నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర నాయకత్వాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీ కోసం పనిచేయాలని సూచించారు. సమీక్ష సమావేశాలు ముగిసిన తరువాత ప్రతి నియోజకవర్గ పరిశీలకుడు ప్రతి మండలంలోని పర్యటించి కార్యకర్తల ప్రజల సమస్యలను తెలుసుకొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గోరంట్ల మాధవ్, మాజీ శాసనసభ్యుడు వైటి ప్రభాకర్ రెడ్డి, మాజీమంత్రి నర్సే గౌడు, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి, నాయకులు వెన్నపూస రవీంద్రారెడ్డి తదితరులు ప్రసంగించారు. వైసిపిని మరోమారు అధికారంలోకి తేవటానికి ప్రతి కార్యకర్త, నాయకుడు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జెడ్పీ ఛైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, నియోజకవర్గం పరిశీలకుడు అశోక్ కుమార్, ఇక్కలిగ కార్పొరేషన్ చైర్‌పర్సన్ నళిని రంగే గౌడ్ తదితరులు పాల్గొన్నారు.