ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తాను అలా అంటే వ్యంగంగా మాట్లాడారు... చంద్రబాబు నాయుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 16, 2022, 08:16 PM

నాడు తాను విజన్ 2020 అన్నప్పుడు చాలా మంది ఎగతాళి చేశారని, 420 అని వ్యంగ్యం ప్రదర్శించారని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. గతంలో అప్పటి మలేషియా ప్రధాని మహతీర్ మహ్మద్ విజన్ 2020 గురించి చెప్పారని, ఆయన సలహా మేరకు విజన్ 2020 రూపొందించామని తెలిపారు. విజన్ 2020 కల నేడు సాకారమైందని తెలిపారు. విజన్ 2020లో భాగంగా ప్రారంభించిన సంస్థలు ఇప్పుడు ఉజ్జ్వలంగా ప్రకాశిస్తున్నాయని చంద్రబాబు వివరించారు. 


టీడీపీ అధినేత చంద్రబాబు నేడు హైదరాబాదులోని ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్ బీ) 20 ఏళ్ల ఆవిర్భావ వేడుకల ముగింపు సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఐఎస్ బీ ప్రాంగణంలో కలియదిరిగారు. 11 ఏళ్ల కిందట ఇదే ప్రాంగణంలో చంద్రబాబు ఓ మొక్కను నాటారు. ఇప్పుడది చెట్టుగా ఎదగడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు ప్రసంగిస్తూ, ఇవాళ ఎంతో ఆనందకరమైన రోజు అని పేర్కొన్నారు. ఐఎస్ బీ ఈస్థాయికి చేరడం సంతోషం కలిగిస్తోందని అన్నారు. 


ఈ సందర్భంగా ఆయన గతంలో ఓసారి తాను మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తో అన్న మాటలను చంద్రబాబు ప్రస్తావించారు. "భారతీయులు పుట్టుకతోనే గణితంలో ప్రజ్ఞావంతులు. వారికది వారసత్వంగా వస్తుంది. ఇక బ్రిటీష్ వాళ్లు మనదేశంలో కోహినూర్ డైమండ్ సహా అన్నీ తీసుకెళ్లారు కానీ, వాళ్ల ఇంగ్లీషును ఇక్కడ వదిలి వెళ్లారు. దాన్ని మాత్రం తీసుకెళ్లలేకపోయారు. ఆ ఇంగ్లీషు, గణితం కలిసి తిరుగులేని కాంబినేషన్ గా అవతరించాయి... భారతీయులను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అగ్రగామిగా నిలిపాయి. 100 శాతం భారత్ బలం ఇదేనంటూ  బిల్ గేట్స్ కూడా దీన్ని అంగీకరించాడు" అని వివరించారు. 


ఆ తర్వాత కాలంలో మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయం ఉన్న సియాటిల్ నగరానికి కూడా వెళ్లానని, బిల్ గేట్స్ తో స్నేహం పెంచుకున్నానని, ఇదంతా కూడా రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్ ను తీసుకువచ్చేందుకేనని చంద్రబాబు వెల్లడించారు. 10 నిమిషాలు అపాయింట్ మెంట్ ఇచ్చిన బిల్ గేట్స్ తో 45 నిమిషాలు మాట్లాడానని తెలిపారు. మైక్రోసాఫ్ట్ వస్తే ఇతర సంస్థలు కూడా వస్తాయని తనకు తెలుసని అన్నారు. 


20 ఏళ్ల కిందట నగరంలో సెంట్రల్ యూనివర్సిటీ ఒక్కటే ఉండేదని, ఇప్పుడు ప్రపంచస్థాయి సంస్థలకు హైదరాబాద్ నిలయంగా మారిందని చంద్రబాబు చెప్పారు. ఈ క్రమంలో ఐఎస్ బీ ఏర్పాటు కూడా సాధ్యమైందని, ఎంతో శ్రమించాక హైదరాబాదులో ఐఎస్ బీ స్థాపించాలన్న కల సాకారమైందని వివరించారు. మర్యాద ఇచ్చిపుచ్చుకోవడంలోనే పనులు సమకూరతాయన్న సూత్రాన్ని నమ్మానని చంద్రబాబు వెల్లడించారు. 


అందరు పారిశ్రామికవేత్తలను సంతృప్తిపరిచి ఐఎస్ బీని తీసుకువచ్చామని, అంతకుముందు పారిశ్రామికవేత్తలు ముంబయి, చెన్నై, బెంగళూరు నగరాలు తిరిగి చివరికి హైదరాబాద్ వచ్చారని వివరించారు. అడిగిన వెంటనే రూ.5 కోట్లు సాయం చేసిన ఫార్మా కౌన్సిల్ ఇక్కడకు వచ్చేలా చేశామని స్పష్టం చేశారు. 


20 ఏళ్ల కిందట హైదరాబాద్ తో నేటి హైదరాబాద్ ను పోల్చితే ఊహకందని మార్పు చోటుచేసుకుందని పేర్కొన్నారు. ఐటీ, బయోటెక్ రంగాల్లో హైదరాబాద్ ఎంతో ప్రగతి సాధించిందని, బయోటెక్నాలజీలో జీనోమ్ వ్యాలీ కొత్త విప్లవం సృష్టించిందని తెలిపారు. 162 కిలోమీటర్ల అవుటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) హైదరాబాద్ కు మణిహారం అని చంద్రబాబు అభివర్ణించారు. ఓఆర్ఆర్ పక్కన వచ్చిన పచ్చదనం హైదరాబాద్ కు గ్రీన్ సిటీ అవార్డు తెచ్చిపెట్టిందని వెల్లడించారు. 


ఇప్పుడు తాను కొత్తగా ప్రతిపాదిస్తున్న సిద్ధాంతం 'డెమొగ్రాఫిక్ అడ్వాంటేజ్' అని చంద్రబాబు తెలిపారు. భారత్ లో ఉన్న అధిక జనాభాను, ముఖ్యంగా యువతను ఉపయోగించుకుని అభివృద్థి పథంలో పయనించడమే ఈ డెమొగ్రాఫిక్ అడ్వాంటేజ్ అని వివరించారు. యూరప్, జపాన్ దేశాల్లో ప్రజల్లో అత్యధికులు వృద్ధాప్యంలోకి చేరుకుంటున్నారని, వాటితో పోల్చితే భారత్ కు ఉన్న ఆధిక్యత యువత అని, వారిని అవకాశాలుగా మలచుకోవాలని పిలుపునిచ్చారు. 


2047 నాటికి భారతీయులు అధిక తలసరి ఆదాయం ఉన్నవారిగా మారతారని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. అదే సమయంలో భారత ఆర్థిక వ్యవస్థ కూడా అంతర్జాతీయ స్థాయిలో టాప్-3లో ఉంటుందని పేర్కొన్నారు. స్వాతంత్ర్య శతాబ్ది ఉత్సవాల నాటికి భారత్ బలమైన శక్తిగా ఎదుగుతుందని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com