యాడికి మండలంలోని పెద్దపేట గ్రామానికి చెందిన డ్రైవర్ రంగస్వామి ఇంటిలో శుక్రవారం చోరీ జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ వెంకటేశ్వర్లు తన సిబ్బందితో రంగస్వామి ఇంటి కి చేరుకుని వివరాలు సేకరించారు. రంగస్వామి లారీ డ్రైవర్ కావడంతో డ్యూటీకి వెళ్లాడు. అతని భార్య రుక్మిణిదేవి ఉపాధి కూలి పనులకు శుక్రవారం వెళ్లింది. ఇంటి తలుపులకు తాళం వేసి పక్కనే వున్న తమ చిన్నపాటి గదిలో తాళం చెవులు వుంచి యదావిధిగా పనులకు వెళ్లింది. 11. 30 గంటలకు తిరిగి వచ్చిన ఆమె ఇంటి తాళాలు తీసుకుని తలుపులు తీయగా ఇంటిలో చిందరవందరగా వస్తువులు పడివుండడంతో పాటు బీరువా నుండి కిందపడిన వాటిని చూసి బీరువాలో దాచి వున్న ఒక తులం కమ్మలు, మూడు ఉంగరాలు, 16, 500 రూపాయల నగదును దొంగలు ఎత్తుకెళ్లినట్లు గ్రహించింది. జరిగిన సంఘటపై బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్ఐ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.